హైదరాబాద్ నుంచి కొమురవెల్లి వెళ్లే భక్తులకు శుభవార్త

హైదరాబాద్ నుంచి కొమురవెల్లి వెళ్లే భక్తులకు శుభవార్త

సిద్దిపేట, వెలుగు: ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26 ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ గా రైల్వే స్టేషన్ ను ప్రారంభించనున్నారు.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి  కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి,  మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారు. 

హాల్ట్ స్టేషన్పై ఆలస్యంగా నిర్ణయం.. 
మనోహరాబాద్ నుంచి కొత్త పల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా సాంకేతిక కారణాలతో మొదట లకుడారం వద్ద రైల్వే స్టేషన్ ను నిర్మించారు. దీంతో కొమురవెల్లికి వచ్చే భక్తులు లకుడారం స్టేషన్ దిగి 12 కిలో మీటర్ల దూరం ఆటోల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్య ప్రధాన అడ్డంకి మారడంతో స్థానికులు భక్తులు రాష్ట్ర , కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్ లకు ప్రత్యేకంగా  విజ్ఞప్తి చేయడంతో రైల్వే అధికారులు పరిశీలించారు.

కొమురవెల్లి వద్ద రైల్వే లైన్ స్కిప్పర్ గ్రేడ్  లోకి రావడంతో రైల్వే స్టేషన్ ఏర్పాటు నిబంధనలు అడ్డంకిగా మారగా, దీనిపై టెక్నికల్ కమిటీ ప్రత్యేక పరిశీలన జరిపి  స్కిప్పర్ గ్రేడ్ లో వున్న ప్రదేశాల్లో స్పెషల్ సేఫ్టి మెజర్స్ తో హాల్ట్  స్టేషన్  ఏర్పాటుకు అనుమతిచ్చింది. దాదాపు రెండేండ్ల కింద రైల్వే హాల్ట్ స్టేషన్ కు భూమి పూజ నిర్వహించగా ఇప్పటికీ పనులు పూర్తవడంతో  అధికారులు ప్రారంభానికి సిద్ధం చేశారు.

తీరనున్న భక్తుల కష్టాలు
కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుతో హైదరాబాద్ నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల రవాణా  ఇబ్బందులు తొలగిపోనున్నాయి. మెదక్ జిల్లా  మనోహరాబాద్  కరీంనగర్ జిల్లా  కొత్త పల్లి వరకు 151 కిలో మీటర్ల  రైల్వే లైన్ లో భాగంగా కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ను నిర్మించారు. రాజీవ్ రహదారి కొండపాక గేట్ నుంచి రెండు కిలో మీటర్ల దూరంలోని  రైల్వే అండర్ పాస్ సమీపంలో  కొమురవెల్లి రైల్వే స్టేషన్ ను నిర్మించారు.

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ప్రారంభమైతే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు చత్తీస్​గఢ్, మధ్య ప్రదేశ్​ రాష్ట్రాల నుంచి  వచ్చే భక్తులకు రవాణా  బాధలు తప్పనున్నాయి. ప్రతిఏటా కొమురవెల్లికి ఉభయ తెలుగు రాష్ట్రాల తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు పాతిక లక్షల మంది మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తుంటారు. మూడు నెలల జాతర సందర్భంగా పది లక్షలకు పైగా భక్తులు కొమురవెల్లికి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వస్తుంటారు.

సకల సౌకర్యాలతో రైల్వే స్టేషన్
కొమురవెల్లి పుణ్య క్షేత్రం పేరిట నిర్మించిన రైల్వే స్టేషన్ రాజీవ్ రహదారికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ  హాల్ట్ స్టేషన్ లో ప్రయాణీకుల సకల సౌకర్యాలను కల్పించారు. దాదాపు అర ఎకరం స్థలంలో 400  మీటర్ల పొడవైన రైల్వే  ఫ్లాట్ ఫామ్ నిర్మించగా భవిష్యత్లో మరో రైల్వే ట్రాక్  నిర్మాణం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. స్టేషన్ బిల్డింగ్, వెయిటింగ్ హాల్, షెల్టర్ సీటింగ్, టికెట్ కౌంటర్లతో పాటు ప్రయాణీకులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రైల్వే  స్టేషన్ నుంచి  ఆలయానికి వెళ్లే మెయిన్ రోడ్డుకు 500 మీటర్ల మేర  ప్రత్యేకంగా సీసీ రోడ్డును నిర్మించారు.

కొమురవెల్లి పుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం కాగానే  సిద్ధిపేట-–సికింద్రాబాద్ మధ్య నడిచే డెమో రైళ్లకు కొమురవెల్లి రైల్వే స్టేషన్‌‌లో హాల్ట్‌‌ కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

17654 రైలు మధ్యాహ్నం 2.38 గంటలకు, తిరుగు ప్రయాణంలో 17655 రైలు రాత్రి 8.04 గంటలకు, 17650 రైలు ఉదయం 7.04 గంటలకు, తిరుగు ప్రయాణంలో 17653 రైలు మధ్యాహ్నం 12.52 గంటలకు కొమురవెల్లిలో ఆగనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ప్రారంభంతో హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు రూ.20 టికెట్, సిద్దిపేట నుంచి వచ్చే వారు రూ.10 టికెట్స్గా నిర్ణయించారు.

ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లు..
కొమురవెల్లి పుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్బంగా భారీ సభను నిర్వహించడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.  సభ ఏర్పాట్ల కోసం రైల్వే శాఖ, పోలీసు  అధికారులు ఇటీవలే క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సభకు సుమారు మూడు వేల మంది హాజరుకానున్న నేపథ్యంలో సమావేశ వేదిక, పార్కింగ్, వీఐపీల భద్రత, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు, ప్రజలకు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.