గ్రేటర్ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

 గ్రేటర్ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

హైదరాబాద్/ మల్కాజిగిరి/గండిపేట/ వికారాబాద్, వెలుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శమని బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ అన్నారు. లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా బల్దియా హెడ్డాఫీసులో ఆయన ఫొటోకు కమిషనర్ లోకేశ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఖైరతాబాద్ లోని వాటర్ బోర్డు ఆఫీసులో ఎండీ దానకిశోర్, నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీలో బాపూజీ ఫొటోకు  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. హిమాయత్ సాగర్​లోని రాష్ట్ర పోలీస్ అకాడమీలోనూ వేడుకలు జరిగాయి. మల్కాజిగిరి చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్​లో జయంతి నిర్వహించగా.. కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు. 

కొండా లక్ష్మణ్​ బాపూజీకి భారతరత్న ఇవ్వాలె

అన్ని వర్గాల ఆత్మ బంధువు అయిన కొండా లక్ష్మణ్‌ బాపూజీకి భారతరత్న ఇచ్చి, గౌరవించాలని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ డిమాండ్‌ చేశారు. తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్, సదరన్ పొలిటికల్ అకాడమీ, బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, జంపాల రాజేశ్, బీసీ రాజ్యాధికార కోర్ కమిటీ సభ్యులు దోనేటి కృష్ణలత, బొమ్మ నరేందర్, నిమ్స్ అధికారి మార్త రమేశ్‌, ప్రొఫెసర్ వెంకట్ రాజం, చాపర్తి కుమారస్వామి తదితరులు పాల్గన్నారు.

పీవీటీ మార్కెట్ లో..

సరూర్​నగర్ లోని పీవీటీ మార్కెట్​లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ ఫొటో వద్ద పీవీటీ ఫౌండర్, కమిటీ అధ్యక్షుడు భారత పురుషోత్తం, ట్రెజరర్  కైరెంకొండ సత్యనారాయణ, డైరెక్టర్లు జెల్ల లక్ష్మీనారాయణ, పెండెం జనార్ధన్ నివాళులర్పించారు.   ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా లక్ష్మణ్ బాపూజీ పదవులను త్యాగం చేసి ఉద్యమాన్ని ముందుండి నడిపించారని వారు గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవలందించారని, బీసీలకు కుల సంఘాలను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో పీవీటీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కైరెంకొండ ధనుంజయ, ఉపాధ్యక్షుడు బొడ్డు శ్రీధర్, కార్యదర్శి భువనగిరి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి తడక కృష్ణ, ట్రెజరర్ చెరుకు భిక్షపతి, డైరెక్టర్లు మానుపూరి ప్రసాద్ కుమార్, రాపోలు సురేష్, పొట్ట రెడ్డయ్య, మడిచేటి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.