ఢిల్లీలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఢిల్లీలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధానిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ తెలంగాణ భవన్​లోని  అంబేద్కర్ ఆడిటోరియంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహించింది. భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్.. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓఎస్డీ సంజయ్ జాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ్​ ఉప్పల్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో, ముల్కీ ఉద్యమంలో,  నిజాం వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్​ బాపూజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలపై జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి బాపూజీ అని.. రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేశారని.. బడుగు బలహీన వర్గాల చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.

బాపూజీ స్ఫూర్తితో పయనిస్తాం: కాంగ్రెస్​

కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గంలో పయనించి, ఆయన స్ఫూర్తితో బీసీ వర్గాల రాజకీయ హక్కుల కోసం పోరాడుతామని కాంగ్రెస్ బీసీ నేతలు అన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్​లో కొండా లక్ష్మణ్  బాపూజీ చిత్రపటానికి వారు నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతలు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, కత్తి వెంకటస్వామి, కొనగల మహేశ్, మెట్టు సాయి, కత్తి కార్తీక తదితరులు పాల్గొన్నారు.