హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ డిగ్రీ, సంబంధిత కోర్సులను ఇతర విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసినా, వాటికి తమతో ఎలాంటి సంబంధం లేదని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలోని రాజేంద్రనగర్, మోజెర్ల, మల్యాల హార్టికల్చర్ కళాశాలల్లో మాత్రమే బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ కోర్సుకు అధికారిక గుర్తింపు ఉందని తెలిపింది. అలాగే 2026–27 విద్యా సంవత్సరం నుంచి అశ్వరావుపేట హార్టికల్చర్ కళాశాలలో కూడా ఈ కోర్సుకు గుర్తింపు ఇచ్చి ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఈ నాలుగు కళాశాలలే హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అధికారికంగా బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ కోర్సును నిర్వహిస్తున్నాయని పేర్కొంది. వీటిని మినహాయించి రాష్ట్రంలోని ఇతర వర్సిటీలు లేదా కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నట్లు ప్రకటించినా, వాటికి హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదని స్పష్టం చేసింది.
