హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పందిరి కూరగాయలైన కాకర, బీర, సొర, దోసకాయ పంటలకు పండు ఈగ వల్ల కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీ అమెరికాలోని వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధనలు చేపట్టనుంది. ఈ విషయాన్ని హార్టికల్చర్ వర్సిటీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వర్జీనియా టెక్ శాస్త్రవేత్త డాక్టర్ మునియప్పన్, ఆర్థిక నిపుణురాలు డాక్టర్ అనుప్ గుప్తాల బృందం హార్టికల్చర్ వర్సిటీని సందర్శించి వైస్ చాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డితో సమావేశమైంది. కేవలం రసాయనాలపైనే ఆధారపడే పద్ధతులు పంటలకు భవిష్యత్తులో ఆశించిన ఫలితాలను ఇవ్వవని వర్జీనియా బృందం సూచించింది.
సమగ్ర కీటక నివారణ విధానాలను అవలంబిస్తూ పర్యావరణహిత పరిష్కారాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కూరగాయలు సాగు చేసే 25 గ్రామాల్లో సంయుక్త పరిశోధనలు చేపట్టాలని రెండు వర్సిటీలు నిర్ణయించాయి. కూరగాయల పంటల్లో తామర పురుగులు, వంకాయలో కాయ-కొమ్మ తొలిచే పురుగు, క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటల్లో డైమండ్ బ్యాక్ మాత్ నియంత్రణపై సమర్థవంతమైన పద్ధతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు దండ రాజి రెడ్డి తెలిపారు.
భవిష్యత్తులో రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ.. పురుగులు, తెగుళ్లను సమర్థవంతంగా నివారించే ప్రత్యామ్నాయ సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ పరిశోధనల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. సమావేశంలో వర్సిటీ అధికారులు డాక్టర్ జే చీనా, డాక్టర్ కె. వీరాంజనేయులు, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ రాజశేఖర్, కూరగాయల పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ డి. అనిత కుమారి, టెక్నికల్ సెక్రటరీ డాక్టర్ పి. సైదయ్య, ఏటీజీసీ బయోటెక్ ఎండీ డాక్టర్ మార్కండేయ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వి.బి. రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
