
సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత పై కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతిని అడ్డుపెట్టుకొని ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని కవిత చేస్తోందని విమర్శించారు. జాగృతి పేరుతో కవిత దేశ, విదేశాల నుంచి కోట్లాది రూపాయాలను దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. విదేశాల్లో బతుకమ్మలు ఆడుతూ కోట్లు దండుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక జాగృతిని పట్టించుకోలేదనన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయంతోనే కవిత మళ్లీ జాగృతిని రంగంలోకి దింపారని చెప్పారు.
మేధావుల సలహాలు, సూచనలు సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని..అందుకే వారు సైలెంట్ అయిపోయారని కొండా సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రికి ఏది అనిపిస్తే అదే చేస్తారని చెప్పారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని..వారి త్యాగాలను చూసే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక సంపదను దోచుకుంటూ కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగు పడిందన్నారు. తెలంగాణను దోచుకున్నది చాలదన్నట్టు..దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత రాబడి పార్టీగా మారిందని ఆరోపించారు.