హస్తినలో హైటెన్షన్!..కేబినెట్ ప్రక్షాళనపై కొనసాగుతున్న ఉత్కంఠ

హస్తినలో హైటెన్షన్!..కేబినెట్ ప్రక్షాళనపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • కేసీ వేణుగోపాల్​తో సీఎం భేటీ
  • గంటపాటు రేవంత్ మంతనాలు
  • కొండా అంశంపైనే సుదీర్ఘ చర్చ?
  • మంత్రుల పనితీరు, పార్టీ ఇన్ సైడ్ అంశాలపై కేసీకి డిటెయిల్డ్ రిపోర్ట్ 
  • నేడు కేసీతో మీనాక్షి నటరాజన్​, మహేశ్ కుమార్​ గౌడ్ మీటింగ్
  • ఖర్గే, కేసీని కలిసేందుకు కొండా సురేఖ ప్రయత్నాలు

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్​ రాజకీయాలతో  దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్‌ నెలకొన్నది.  ఇటు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్​మహేశ్‌ గౌడ్‌తోపాటు కీలక మంత్రులు, సీనియర్‌ నేతలంతా ఏకకాలంలో హస్తిన బాట పట్టడం, అటు కొండా సురేఖ అంశంతోపాటు మంత్రివర్గ ప్రక్షాళనపై హైకమాండ్​ ఏదో ఒకటి తేల్చనుందనే సంకేతాలతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై  చర్చించారు. వెయ్యి రోజుల పాలన, పార్టీ అంతర్గత పరిస్థితులు, మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు  చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టం, పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన  నివేదిక సారాంశం,  రాష్ట్ర మంత్రుల పనితీరు,  ప్రక్షాళన ఆవశ్యకత లాంటి కీలక అంశాలపై వివరించి, నివేదిక సమర్పించారు.  

బుధవారం ఖర్గేతోనూ సీఎం రేవంత్​రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ భేటీ కానుండగా, అటు మంత్రి కొండా సురేఖ సైతం ఇరువురు అగ్రనేతలను కలవనుండడం ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద బంతి కాస్తా ఏఐసీసీ కోర్టుకు చేరడంతో హైకమాండ్​తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతున్నది.

కేసీతో సీఎం గంటపాటు  భేటీ


కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌‌తో  సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం ఢిల్లీ లోథి రోడ్‌‌లోని కేసీ నివాసానికి సాధారణ కాన్వాయ్ లో వెళ్లారు. సాయంత్రం 6:50 గంటల నుంచి 7:55 గంటల వరకు దాదాపు గంటపాటు కేసీతో సమావేశమయ్యారు.  మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు, మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం చిన్నారెడ్డి తీరుపై క్రమశిక్షణా కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, వెయ్యి రోజుల పాలనపై కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అలాగే, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. దీంతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న నేతల తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై అధిష్టానం ఫోకస్ చేయాలని, ఇలాంటి నేతల తీరుతో పార్టీకి, ప్రభుత్వం నష్టం జరిగే ప్రమాదం ఉందని నివేదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ దీనిపై లోతైన విచారణ జరిపిన తర్వాతే నివేదికను హైకమాండ్‌‌కు అందజేసినట్టు వివరించారు. ఇదే సందర్భంలో మంత్రుల పనితీరు, పార్టీ అంతర్గత అంశాలపై కేసీకి సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్ అందజేశారు. ఆయా శాఖల వారీగా పనితీరు వివరాలు, మంత్రుల వ్యవహారం, పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల పేర్లను ప్రస్తావించినట్టు తెలిసింది. వీటితోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరిగినట్టు సమాచారం.  సుదీర్ఘ కాలంగా పార్టీ వెన్నంటే ఉన్న సీనియర్లు, యువ నేతలకు అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతోపాటు వెయ్యి రోజుల పాలన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాలను కేసీకి  సీఎం  తెలియజేసినట్టు సమాచారం.

సురేఖకు ఖర్గే, కేసీ అపాయింట్​మెంట్​

ఇక ఖర్గే, కేసీ వేణుగోపాల్‌‌తో  మంత్రి సురేఖ సమావేశం కానున్నారు. ఈమేరకు అపాయింట్‌‌మెంట్​కూడా లభించడంతో ఆమె వారికి ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వీలునుబట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్​కుమార్​రెడ్డితోనే అధిష్టానం మాట్లాడుతుందని, అందుకే అందుబాటులో ఉండాలని వారిద్దరికీ చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే స్పీకర్​గడ్డం ప్రసాద్​, ఎమ్మెల్సీ విజయశాంతి సహా పలువురు నేతలు  అధిష్టానం పెద్దలను కలిసి తమ పేర్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్టీలో కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల పేర్లు, ప్రస్తుత మంత్రుల పనితీరు, శాఖల మార్పుపై ఇప్పటికే కేసీకి నివేదిక ఇచ్చిన సీఎం రేవంత్​రెడ్డి.. బుధవారం ఖర్గేను కలిసి అందజేయనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటు  మంత్రి కొండా సురేఖ అంశంతోపాటు  అటు మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై హైకమాండ్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే.. 

సీఎంసహా రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. వీరిలో పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​, మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, కొండా సురేఖ,  తుమ్మల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​బాబు బయలుదేరి వెళ్తారు.  వీరంతా ఢిల్లీలో జరిగే వైఎస్ స్మారక అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తున్నప్పటికీ.. తమకు కేటాయించిన సమయంలో పార్టీ ముఖ్యనేతలనూ కలవనున్నారు.  బుధవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జి మీనాక్షి సమావేశం కానున్నారు. కేసీ వేణుగోపాల్‌తో పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఢిల్లీలోని కాంగ్రెస్  ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో సీఎం ఉండరని తెలుస్తున్నది. మంత్రి కొండా సురేఖ అంశంపైనే  ఈ ముగ్గురు నేతలు చర్చించనున్నట్టు సమాచారం.