152 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోండి.. తుమ్మిడి హెట్టిపై మహారాష్ట్రకు తెలంగాణ రిక్వెస్ట్

152 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోండి.. తుమ్మిడి హెట్టిపై మహారాష్ట్రకు తెలంగాణ రిక్వెస్ట్
  •     నష్టం జరగదంటూ లెక్కలతో చెప్పిన అధికారులు
  •     చాప్రాల అభయారణ్యానికి ఢోకా లేదంటూ క్లారిటీ
  •     సీడబ్ల్యూ పీఆర్​ఎస్​ రిపోర్టులను చూపిన ఇంజినీర్లు
  •     తెలంగాణ ప్రతిపాదనలు పరిశీలించాలన్న సీడబ్ల్యూసీ
  •     స్టడీ రిపోర్టులు పరిశీలించి చెప్తామన్న‘మహా’ ఆఫీసర్లు
  •     సమావేశం మూడు వారాలకు వాయిదా

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై పదేండ్ల తర్వాత తొలిసారి తెలంగాణ, మహారాష్ట్ర సమావేశమయ్యాయి. ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీటింగ్ సానుకూల వాతావరణంలో సాగింది.  ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తొలి అడుగుగా మహారాష్ట్రను ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నది. తాజాగా మంగళవారం సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ కార్యదర్శులతో మీటింగ్ నిర్వహించారు. మహారాష్ట్రకు చెప్పాల్సిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం క్లియర్‌‌గా చెప్పింది.

బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించుకునేందుకు ఒప్పుకోవాలని ఆ రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీని మన సెక్రటరీ ఇ.శ్రీధర్ కోరారు. దాని వల్ల రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు. కానీ ముంపు ప్రభావంపై మహారాష్ట్ర సెక్రటరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకుముందు చేసుకున్న ఒప్పందానికే కట్టుబడి ఉంటే బాగుంటుందని చెప్పారు. దీనిపై ఆ రాష్ట్ర సెక్రటరీకి మన అధికారులు డిటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా 80 టీఎంసీల నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.

పెద్ద ముంపేమీ లేదు..

బ్యారేజీ ఎత్తు పెంచడం వల్ల ముంపు ముప్పు ఎక్కువగా ఏమీ ఉండదని మన అధికారులు పేర్కొన్నారు. బ్యారేజీని ఏ ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో ఎంత ముంపు ఉంటుందో గణాంకాలతో వివరించారు.మహారాష్ట్రలోనే ఉండే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్​) చేసిన స్టడీ రిపోర్టుల్లోని వివరాలతో ఉదహరించారు. చాప్రాల వన్యప్రాణి శాంక్చువరీకి ముప్పు ఉంటుందని మహారాష్ట్ర సెక్రటరీ చెప్పారని తెలిసింది. కాగా 152 మీటర్లతో నిర్మించినా కూడా శాంక్చువరీకి ఎలాంటి ముంపు ముప్పు లేదని మన అధికారులు వివరించారు. ఎక్కువ భాగమంతా నదీ గర్భంలోనే ఉంటుందని, గ్రామాలకూ ముప్పు లేదని స్పష్టం చేశారు. 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 1,150 ఎకరాలు మొత్తం నదీ గర్భంలోనే ముంపు ఉంటుందని చెప్పారు. అదే 150 మీటర్లతో నిర్మిస్తే కొంత అటవీ భాగంతో పాటు 1,500 ఎకరాల వరకు ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కాగా అటవీ భాగంలో 943 ఎకరాల వరకు సమస్య ఉన్నా.. చాప్రాల శాంక్చువరీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. అదే సమయంలో 152 మీటర్లతో బ్యారేజీని నిర్మిస్తే 2,500 ఎకరాల వరకు ముంపు ఉంటుందని, అక్కడ కూడా ప్రస్తుత బ్యారేజీ అలైన్‌‌మెంట్‌‌తో శాంక్చువరీకి ప్రమాదమేమీ ఉండదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ స్టడీ చేసి ఈ విషయాన్ని చెప్పిందని మహారాష్ట్ర సెక్రటరీకి వివరించారు. 

ఓసారి మీరూ చూడండి..

దీనిపై మహారాష్ట్ర కూడా కొంత పాజిటివ్​గానే రెస్పాండ్ అయినట్టు మన అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలనూ ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్ కూడా మహారాష్ట్రకు సూచించారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ వంటి సంస్థ చేసిన స్టడీలు ఎలాంటి నష్టం ఉండదని తేలింది కాబట్టి.. ఒకసారి పరిశీలించాలని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి కన్‌‌క్లూజన్‌‌కు రాలేమని మహారాష్ట్ర సెక్రటరీ అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ ప్రాంతంలో ఇప్పటివరకు చేసిన స్టడీ రిపోర్టులన్నీ ఇవ్వాల్సిందిగా తెలంగాణను కోరారు. ఆ రిపోర్టులను డిటెయిల్డ్‌‌గా అధ్యయనం చేస్తామని చెప్పారు. దీంతో సీడబ్ల్యూపీఆర్ఎస్ స్టడీ రిపోర్టుతో పాటు ఆర్వీ అసోసియేట్స్ తయారు చేసిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టునూ మహారాష్ట్రకు అందజేశారు. మళ్లీ మూడు వారాల తర్వాత సమావేశమవ్వాలని నిర్ణయించారు. 

పదేండ్ల తర్వాత తొలిసారి..

ఈ ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలం తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే కావడం విశేషం. గతంలో 2016 ఆగస్టు 23న రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ప్రాజెక్టు ఎత్తుపై ఒప్పందం జరిగింది. అప్పటి సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌తో పాటు మంత్రులు, అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే, తొలి మీటింగ్ మాత్రం 2012లోనే ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించారు. ఆ తర్వాత తొలిసారిగా 2012లో నాటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్​తో ఉమ్మడి ఏపీ అప్పటి సీఎం కిరణ్ కుమార్​రెడ్డి సమావేశం జరిగింది. కానీ, ఎలాంటి ఫలితం తేలలేదు. 2015 మార్చిలో తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ తొలిసారిగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​తో భేటీ అయ్యారు. దీనిపై రెండు రాష్ట్రాల అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. మళ్లీ 2016 మార్చి 8న మరోసారి మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ అయ్యారు. అప్పుడే 148 మీటర్లైతేనే ఒప్పుకుంటామని మహారాష్ట్ర స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ కూడా సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల్లేకుండా నీటి వినియోగానికి సంబంధించి ఇంటర్ స్టేట్ బోర్డును ఏర్పాటు చేశారు.