పార్టీ మారను.. బీజేపీలోనే ఉంట​:  కొండా విశ్వేశ్వర్​రెడ్డి

పార్టీ మారను.. బీజేపీలోనే ఉంట​:  కొండా విశ్వేశ్వర్​రెడ్డి


హైదరాబాద్, వెలుగు: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, బీజేపీలోనే కొనసాగుతానని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు. ‘‘నేనే కాదు, ఎవరూ కూడా బీజేపీని వదిలిపెట్టి పోరు.. కేసీఆర్ ను ఓడించే పార్టీ బీజేపీ మాత్రమే” అని చెప్పారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు తాను మాట్లాడిన మాటలను వక్రీకరించాయని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘నేను మాట్లాడిన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్న. లిక్కర్ స్కామ్​ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని ప్రజల్లో ఉంది. కానీ ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది సీబీఐ, ఈడీలే చూసుకుంటయ్​. ఆమెను బీజేపీ అరెస్టు చేయలేదు కదా.. విచారణ చేయాలని మాత్రమే కేంద్రం చెప్తుంది.. దోషి అని తేలితే  విచారణ సంస్థలే అరెస్టు చేస్తయ్​” అని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బీజేపీ వైపు రావాలని, బీఆర్ఎస్ ను కొట్టగలిగే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ‘‘మాది సిద్ధాంతం గల పార్టీ.. చిన్న రాష్ట్రాలకే కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ.  ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేని రెండు తెలుగు రాష్ట్రాలను కలిపింది.. కాంగ్రెస్  ఎప్పుడు ఒక స్టాండ్ మీద లేదు” అని ఆయన అన్నారు.