- పన్నులు కట్టేవాళ్లను.. ఎగ్గొట్టేవాళ్లతో కలపొద్దు: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
- గ్రేటర్ రంగారెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- ఆర్టీఐలకు సర్కార్ జవాబిస్తలేదని బీజేపీ ఎంపీ విమర్శ
హైదరాబాద్, వెలుగు: పన్నులు సక్రమంగా చెల్లించే తమ జిల్లా ప్రజలను పన్నులు కట్టకుండా ఎగ్గొట్టే వాళ్లతో కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయొద్దని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణలోనే అత్యంత ధనిక జిల్లా రంగారెడ్డి. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో మేం కట్టే పన్నుల సొమ్మునంతా తీసుకెళ్లి గజ్వేల్, సిరిసిల్లకు తీసుకుపోయారు.
మరీ ప్రస్తుత ప్రభుత్వం పాతబస్తీకి చెందిన ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో పెడుతదా? పన్నులు సక్రమంగా కట్టే మమ్మల్ని.. పన్నులు ఎగ్గొట్టేవాళ్లతో కలపొద్దు” అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పాతబస్తీలో రూ.500 కోట్లకు పైగా కరెంట్ బిల్లుల బకాయిలు ఉన్నాయని, రంగారెడ్డి జిల్లాను తీసుకెళ్లి చార్మినార్ జోన్‌లో కలపడం వల్ల ఆ భారం ఇక్కడి ప్రజలపై పడుతుందని తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కేవలం 15 వేల ఓట్లకు ఒక డివిజన్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. హిందూ మెజారిటీ ప్రాంతాల్లో మాత్రం 50 వేల నుంచి 70 వేల ఓట్లకు ఒక డివిజన్ చేస్తున్నదని ఆరోపించారు. ఇది తీవ్రమైన అన్యాయమని, దీనిపై తాను ఇప్పటికే 16 ఆర్టీఐ దరఖాస్తులు చేసినా ప్రభుత్వం నుంచి ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు.
ప్రజాభిప్రాయం తీసుకోకుండానే వార్డుల డిలిమిటేషన్ చేస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని సగభాగాన్ని తీసుకెళ్లి చార్మినార్ జోన్‌లో కలపడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. పెద్ద అంబర్ పేట, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా ‘గ్రేటర్ రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఒక వర్గానికి మాత్రమే సీఎం కాదని, హిందువులకు కూడా ఆయనే సీఎం అనే విషయాన్ని యాదికుంచుకోవాలని సూచించారు.
