కరీంనగర్ టౌన్, వెలుగు: భూభారతి స్పెషల్ డ్రైవ్ ద్వారా ధరణి 2020 వల్ల వచ్చిన భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ అన్నారు. శనివారం కరీంనగర్ ఫిలింభవన్‌లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ‘ధరణి 2020 నుంచి ప్రస్తుత భూభారతి 2025 వరకు భూ సమస్యల పరిష్కారం’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కొరివి వేణుగోపాల్ పాల్గొని మాట్లాడారు.
భూభారతి స్పెషల్ డ్రైవ్‌లో భూసమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కరీంనగర్ శివారులోని రేకుర్తిలో నిషేధిత జాబితాలో ఉన్న 4,500 ఇండ్లను తొలగించాలన్నారు. ఈ జాబితాలో ఉన్న వారు 20 ఏండ్లుగా మొదలుకొని 50 ఏండ్ల నుంచి ఇప్పటివరకు వారి పేర్లపై ఇంటిపన్ను కడుతున్నారని గుర్తుచేశారు.
ధరణి, భూ భారతి చట్టాలు వచ్చాక ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.. ఎన్ని పరిష్కారమయ్యాయో ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో రేకుర్తి భూ సమస్యల బాధితుల సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, తిమ్మాపూర్ మండలానికి చెందిన అంజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, మాజీ జడ్పీ కో ఆప్షన్ మెంబర్ జమీల్ అహ్మద్, దళిత నాయకులు నల్లాల కనకరాజు, బోయినపల్లి చంద్రయ్య, శేఖర్, అంజయ్య, అడ్వకేట్లు మల్లేశం, ముజీబ్, తదితరులు పాల్గొన్నారు.

