ఏపీకి కృష్ణాబోర్డు ఆదేశం: సంగమేశ్వరం పనులు చేయొద్దు

ఏపీకి కృష్ణాబోర్డు ఆదేశం: సంగమేశ్వరం పనులు చేయొద్దు

హైదరాబాద్‌, వెలుగు: సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీం పనులు చేయొద్దని కృష్ణాబోర్డు మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై గతంలోనే లెటర్‌ రాశామని గుర్తు చేసింది. ప్రాజెక్టు డీపీఆర్‌ ఇచ్చి, పర్మిషన్లు అన్నీ వచ్చే వరకు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణాబోర్డు మెంబర్‌ హరికేశ్‌ మీనా సోమవారం ఏపీ ఇరిగేషన్‌ ఈఎన్సీ నారాయణరెడ్డికి లెటర్‌ రాశారు. సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌ కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులన్నీ ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని తాము గతంలోనే లెటర్​ రాశామన్నారు. సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనులు చేస్తున్నారని తెలంగాణ సర్కారు తమకు కంప్లైంట్​ చేసిందని
పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి లెటర్​తో కదలిక

సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీంకు డీపీఆర్‌ అవసరం లేదని, పాత ప్రాజెక్టులకు నీళ్లిచ్చేందుకు చేపట్టే ప్రాజెక్టు కాబట్టి ‘డీటైల్డ్‌ ప్రాజెక్టు ఇన్ఫర్మేషన్‌’ మాత్రమే ఇస్తామని ఏపీ కొద్దిరోజులుగా వాదిస్తూ వస్తోంది. అయితే ఈ ఎత్తుగడలకు కేంద్ర మంత్రి లెటర్‌తో ఫుల్‌స్టాప్‌ పడింది. ఒక దశలో అయితే తమ వాదనతో కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ కన్సిన్స్‌ అయ్యాయని కూడా ఏపీ అధికారులు చెప్తూ వచ్చారు. కృష్ణా బోర్డు అధికారులకూ ఇదే చెప్పారు. తమకు క్లియరెన్స్​ వచ్చినట్టే అన్నట్టుగా వ్యవహరించారు. కానీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఇటీవల.. డీపీఆర్‌  ఇవ్వాల్సిందేనని ఏపీ సీఎంకు లెటర్‌ రాయడంతో సీన్‌ రివర్స్‌ అయింది. సంగమేశ్వరం డీపీఆర్‌ ను పూర్తిస్థాయిలో, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గైడ్​లైన్స్​ మేరకు ఇవ్వాల్సిందేనని షెకావత్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కృష్ణా బోర్డు మరోసారి ఏపీకి లెటర్‌ రాసింది.