ఏపీ ప్ర‌భుత్వానికి షాకిచ్చిన కృష్ణా రివర్ బోర్డు

ఏపీ ప్ర‌భుత్వానికి షాకిచ్చిన కృష్ణా రివర్ బోర్డు

జ‌గ‌న్ స‌ర్కార్ కు కృష్ణా రివర్ బోర్డ్ షాక్ ఇచ్చింది. తమకు కేటాయించిన నీటి కేటాయింపుల కంటె ఎక్కువగా నీటిని వాడుకున్నారని ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సాగర్ కుడి కాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి ఎక్కువ నీరు వాడుకున్నారని, ఇక నీటి వాడకాన్ని నిలిపివేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ శాఖకు కృష్ణా బోర్డ్ లేఖ రాసింది.

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన దాని కన్నా ఎక్కువే వాడుకున్నారని కేఆర్ఎంబీ తెలిపింది. కృష్ణా జలాల నీటి లభ్యత 980 టీఎంసీలు ఉండగా… ఏపీకి 647, తెలంగాణకు 333 టీఎంసీలు కేటాయించామ‌ని, ఈ కేటాయింపుల్లో ఇప్పటి వరకూ.. ఏపీ 647.5… తెలంగాణ 272 టీఎంసీలు వినియోగించుకున్నాయని తెలిపింది. ఏపీ మరో అర టీఎంసీ అదనంగా వాడుకున్నారని బోర్డు స్ఫష్టం చేసింది. తెలంగాణకు మరో 56 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని… ప్రస్తుతం కృష్ణాలో 60 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉందని తెలిపింది. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని .. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని ఏపీకి కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.