
- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బండగట్టుకుని బాయిల దుంకిండు: కేటీఆర్
- దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీచేయాలని సవాల్
జగిత్యాల, వెలుగు: ‘ఆ హౌలాగాన్ని చూసి ఎవరూ ఓట్లెయ్యలేదు.. మీరంతా కలిసి కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయ్యిండు.. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటయ్. జగిత్యాల ఎమ్మెల్యే బండకట్టుకొని బాయిలో దుంకి ఆత్మహత్య చేసుకున్నడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి దమ్ముంటే.. రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని సవాల్ చేశారు.
సోమవారం జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంజయ్ కుమార్ సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారారని ఆరోపించారు. తాము జగిత్యాలను జిల్లా చేసి.. మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని, ఇప్పుడు వాటిని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ లోకి సంజయ్ వెళ్లడం సిగ్గుచేటని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ వర్గానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్క టికెట్ కూడా ఇయ్యకుండా అడ్డుపడతారని అన్నారు.
కాంగ్రెస్ లో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నాడని ప్రశ్నించారు. గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ లో విలీనం అయ్యారని చెప్పారు. మరోవైపు సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని గతంలో రాహుల్ గాంధీ చెప్తే సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలోనే గనుల వేలం జరుగుతున్నదని విమర్శించారు.
త్వరలోనే కవిత బయటకు వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు.. గడ్డిపోచలే కొట్టుకుపోతాయని, అసలైన గులాబీ సైనికులు పార్టీతోనే ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రమణ, రాజేశంగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మేడిగడ్డపై చిల్లర రాజకీయం చేసిన్రు
మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం ఇన్నాళ్లు చిల్లర రాజకీయం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘మేడిగడ్డ మేడిపండులా మారింది అన్నారు. అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మతులు చేసినా ఇక పనికి రాదన్నారు. లక్షకోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్నారు. అన్నారం బ్యారేజీ కూడా కూలిపోతదన్నారు. నేడు మాత్రం, మేడిగడ్డకు మరమ్మతులు పూర్తి అయ్యాయంటున్నారు. అంటే, ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారమని తేలిపోయింది. 8 నెలల నుంచి చేసింది కాలయాపనే అని రుజువైపోయింది.
రిపేర్ల మాటున జరిగింది, చిల్లర రాజకీయమని వెల్లడైపోయింది. ఇకనైనా, కేసీఆర్ జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి. వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై, విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలి. కల్పతరువు లాంటి ప్రాజెక్టుపై కుట్రలు చేసిన వారు తప్పు ఒప్పుకోవాలి”అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.
నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వెళ్తే నిరుద్యోగ యువకులపై లాఠీ చార్జ్ చేయడమేమిటని ప్రశ్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న పార్టీ నాయకులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, యువకులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే జారీ చేయాలని కేటీఆర్ కోరారు.