- నిర్మలా సీతారామన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు
- వెంటనే టెండర్ రద్దు చేసి విచారణ జరిపించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక 'పీఎం ఏక్తా (యూనిటీ) మాల్' ప్రాజెక్ట్ టెండర్లలో ఆర్థిక అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని, భారీగా వచ్చే కేంద్ర నిధులను ప్రైవేట్ డెవలపర్లకు దోచిపెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. వెంటనే ప్రస్తుత టెండర్లను రద్దు చేయాలని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన సోమవారం లేఖ రాశారు.
రాయదుర్గంలో అత్యంత విలువైన 6.30 ఎకరాల ప్రాధాన్య భూమిలో, భూమి విలువను మినహాయించి సుమారు రూ. 2,059.81 కోట్ల వ్యయంతో 27 లక్షల చదరపు అడుగులతో ఏక్తా మాల్‌ను నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వానికి దక్కే కనీస వాటా కేవలం 9 లక్షల చదరపు అడుగులు మాత్రమేనన్నారు. ప్రైవేట్ డెవలపర్‌కు కట్టబెట్టిన వాటా ఏకంగా 18 లక్షల చదరపు అడుగులని ఆరోపించారు. రూ. 202 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేలా ఈ నిబంధనలు రూపొందించారని లేఖలో పేర్కొన్నారు.
వంశీరాం - అపర్ణ కన్సార్టియం లబ్ధి కోసం ప్లాన్
టెండర్ ఎవాల్యుయేషన్ లో వంశీరాం బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అపర్ణ ఇన్ఫ్రాహౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లతో కూడిన కన్సార్టియంను ఎంపిక చేశారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వానికి నిర్దేశించిన 9 లక్షల చదరపు అడుగులకు అదనంగా మరో 18,000 ఇస్తామని ఆఫర్ చేసి ఈ టెండర్ పొందినట్లు చూపించారని, కానీ ప్రైవేట్ డెవలపర్‌కు మాత్రం భవిష్యత్తులో వచ్చే అదనపు ఎఫ్‌ఎస్‌ఐ ప్రయోజనాలు, ప్లానింగ్ వెసులుబాట్లన్నీ దక్కేలా రక్షణ కల్పించారని ఆరోపించారు.
కేంద్రం నుంచి ‘సాస్కి’ (స్పెషల్ ఆసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) పథకం కింద మంజూరైన రూ. 200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ప్రైవేట్ డెవలపర్‌కు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చేశారని విమర్శించారు. ఈ నిధులను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎంపిక చేసిన డెవలపర్‌కు 'బ్యాక్-టు-బ్యాక్' పద్ధతిలో బదిలీ చేసేలా కుట్ర చేశారన్నారు. కాబట్టి వెంటనే టెండర్ రద్దు చేసి నిధులు ఆపేయాలని కోరారు. ల్యాండ్ వాల్యుయేషన్, ప్రాజెక్ట్ వ్యయం, ఫైనాన్షియల్ మోడల్, టెండర్ నిబంధనలు, బిడ్ మూల్యాంకనంపై కాగ్ లేదా తగిన ఆడిట్, విజిలెన్స్ దర్యాప్తు సంస్థల ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
