
- తిహార్ జైలులో మూడోసారి చెల్లిని కలిసిన కేటీఆర్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తిహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితను.. సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి కవితతో ములాఖత్ అయ్యారు. దాదాపు 15 నిమిషాలు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఏం చేస్తున్నరు, ఎవరిని కలుస్తున్నరు..
కేటీఆర్ మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్ హస్తినలోనే ఉన్నారు. శనివారం రాత్రి కేటీఆర్, హరీశ్ ఢిల్లీ చేరుకోగా.. ఆదివారం ఇతర నేతలు వచ్చారు. అయితే.. కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే అంశాన్ని మాత్రం గుట్టుగా ఉంచుతున్నారు.
తొలుత సోమ వారం కవితతో ములాఖత్ ఉంటుందని వార్తలు వచ్చినా.. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై కేటీఆర్, హరీశ్, ఇతర నేతలు న్యాయ నిపుణులతో సమావేశం అయినట్లు మీడియా ప్రకటన రిలీజ్ చేశారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్ని బీఆర్ఎస్ నేత ఇంట్లో నిర్వహించి వీడియో సందేశాన్ని పంపించారు. మరోవైపు ఎక్స్ వేదికగా స్పందిస్తూ...ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ కు కేటీఆర్ నివాళి..
ఢిల్లీలో ఉన్న కేటీఆర్ ఆ పార్టీ నేతలతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి, స్మరించుకున్నారు. ఏ తెలంగాణ కోసం జయశం కర్ సార్ జీవితమంతా కష్టపడ్డారో ఇవ్వాళ ఆ తెలం గాణ సాధించుకున్నామని కేటీఆర్ అన్నారు.