జాబ్ నోటిఫికేషన్స్..సాగర్ బై పోల్ తర్వాత

జాబ్ నోటిఫికేషన్స్..సాగర్ బై పోల్ తర్వాత

ఆస్క్ కేటీఆర్ లో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు 

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్కూళ్లు, కాలేజీలను కరోనా తీవ్రత తగ్గాక తెరుస్తామని చెప్పారు. రాష్ట్రంలో పూర్తి లాక్డౌన్ పెట్టే అవకాశం ఉంటుందని తాను అనుకోవట్లేదన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేరళ, బెంగాల్లలో ప్రజాస్వామ్యం గెలవబోతోందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు అవసరమైన నిధులు ఇటీవలి బడ్జెట్లో కేటాయించామన్నారు. తాను కరోనా వ్యాక్సిన్ను ఇంకా తీసుకోలేదన్నారు. ఆదివారం ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’ హ్యాష్ ట్యాగ్పై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు గంటన్నర పాటు కేటీఆర్ సమాధానాలు చెప్పారు. ఈ ఆగస్టు నాటికి రాష్ట్రంలోని 12,751 ఊర్లకు ఫైబర్ గ్రిడ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఏడాదిలోపు పూర్తవుతుందని , మే నెలాఖరుకు బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేస్తామని, 2 నెలల్లో రాయదుర్గం టీ హబ్ ప్రారంభిస్తామని చెప్పారు.  సోమశిలపై సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. 

రేషన్ కార్డుల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తా

మూడేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదని, వితంతు పెన్షన్లూ మంజూరు చేయలేదని మాధురిరెడ్డి అనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అడగ్గా ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 1,530 మంది కాంట్రాక్టు డాక్టర్లు జాబ్ సెక్యూరిటీ లేకుండా పని చేస్తున్నామని ఓ డాక్టర్ చెప్పగా  విషయాన్ని హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదాపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడగాలని సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత ఉన్నమాట నిజమేనని, రాష్ట్రానికి అదనపు డోసులు పంపాలని కేంద్రాన్ని కోరామని, దీనిపై ఇంకా జవాబు రాలేదని అన్నారు. బ్యాంకర్లకు ఎలాంటి కొర్రీలు లేకుండా వ్యాక్సిన్లు వేయాలని ఒకరు అడగ్గా వ్యాక్సినేషన్ గైడ్లైన్స్ను కేంద్రం రూపొందించిందని కేటీఆర్ చెప్పారు. వరంగల్ విమానాశ్రయం, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మెట్రో రైల్, ఫార్మా సిటీ నిర్మాణం కరోనా వల్ల ఆలస్యమవుతున్నాయన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్ నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఫార్మాసిటీ లాంటి వాటి విషయంలో కేంద్రం నుంచి సహకారం లభించడం లేదన్నారు.