జర్మనీ, జపాన్ భాషలు ఎందుకు నేర్చుకోవాలి?: కేటీఆర్

జర్మనీ, జపాన్ భాషలు ఎందుకు నేర్చుకోవాలి?: కేటీఆర్
  •     ఉద్యోగాలు రావాలంటే విదేశీ భాష నేర్చుకోవాలా: కేటీఆర్
  •     కాంగ్రెస్​ సర్కార్ 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చాలెంజ్
  •     గతంలో కొన్ని తప్పులు జరిగాయి.. ఈసారి నేను బాధ్యత తీసుకుంటానని హామీ

హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు జర్మనీ, జపాన్ భాషలు ఎందుకు నేర్చుకోవాలి రేవంత్.. ఉద్యోగాలు రావాలంటే విదేశీ భాష నేర్చుకోవాలా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్​ విసిరారు. రేవంత్ రెడ్డి ముందు నువ్వు తెలుగు నేర్చుకో .. తెలుగులో అన్ని బూతులు మాట్లాడుతున్నావ్​ అని కేటీఆర్​ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సరూర్​నగర్ స్టేడియంలో యువ సంగ్రామం సదస్సు నిర్వహించారు. ఇందులో కేటీఆర్​ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రియాంకా గాంధీ మాటలు నమ్మిన యువత ఓట్లేసి ఆ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన 24 హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. దగాపడ్డ యువత ముందుకొచ్చి కొట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు.

డిక్లరేషన్ పేరుతో లక్షలాది మంది యువతను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతీ యేటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేసిందన్నారు. యూత్ డిక్లరేషన్ అనేది ఒక బురిడీ పత్రమని కొట్టి పారేశారు. ‘కాలేజీ అమ్మాయిలకు ఎక్కడ ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇచ్చారు..? యూత్ కమిషన్ ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు.. నిరుద్యోగ యువకులకు వడ్డీ లేకుండా ఎంత మందికి రూ.10 లక్షల లోన్లు ఇచ్చారు? రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు ట్రిపుల్ ఐటీలు, మూడు యూనివర్సీటీలు ఏవీ? ఎక్కడున్నాయ్’ అని కేటీఆర్ ప్రశ్నించారు. యువశక్తి కదిలితే పీఠాలే కదిలిపోతాయ్ అన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. గతంలో మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని.. అయితే ఈ సారి తానే పూర్తి బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రాబోయే బీఆర్ఎస్ సర్కారులో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానన్నారు.

కేంద్రం, రాష్ట్రం ఉద్యోగాలు ఎక్కడిచ్చాయ్

రెండున్నరేండ్ల కాంగ్రెస్​ పాలనలో 70 వేల ఉద్యోగాలిచ్చినట్టుగా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ చాలెంజ్​ చేశారు. ‘బడే భాయ్ రెండు కోట్ల ఉద్యోగాలు, చోటే భాయ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారు. ఆ ఉద్యోగాలు ఎక్కడిచ్చారు.?’ అని ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌‌ను విమర్శించారు. ‘నేను అమెరికాలో ఉద్యోగం చేశాను.. పోటీ పరీక్షలు రాసిన అనుభవం ఉంది.  రేవంత్ రెడ్డికి, బండి సంజయ్‌‌కు పరీక్షలు రాసే తెలివి ఉందా..’ అని ఎద్దేవా చేశారు. ఇద్దరు నకలు కొట్టే బ్యాచ్, వాళ్లు ఏం చదివారో ఎవరికీ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.