- వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పరామర్శ
ఖమ్మం టౌన్, వెలుగు: వెలుగుమట్ల భూదాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా నిలబడి, వారికి న్యాయం జరిగేందుకు సుప్రీంకోర్టులో కొట్లాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఖమ్మంలో పర్యటించిన ఆయన, ముందుగా వెలుగుమట్లలో బాధితులను పరామర్శించారు. నిర్వాసితులకు ఆశ్రయం కల్పించిన టీటీడీసీలోనూ బాధితులతో మాట్లాడారు.
న్యాయపోరాటానికి అవసరమైన ఖర్చులు బీఆర్ఎస్ భరిస్తుందని, చివరి వరకు బాధితులతోనే ఉంటామని భరోసా ఇచ్చారు. ఖమ్మం కలెక్టరేట్ ను ఆనుకొని ఉన్న విలువైన భూమిపై ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కన్ను పడిందని, అందుకే పేద ప్రజలపై ప్రతాపం చూపించారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో భూదాన్ భూములకు దగ్గరగా కొత్త కలెక్టరేట్ కార్యాలయం నిర్మించినా, ఇక్కడ నివసిస్తున్న పేదలను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నారు.
ఇప్పుడు ఇండ్లు కూల్చేసిన చోటనే తమ ప్రభుత్వం వచ్చాక ఇండ్లు నిర్మించి, గృహ ప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. ఇండ్ల కూల్చివేతలో ఇక్కడి మంత్రులకు ప్రమేయం ఉందని, లేకుంటే మీ దగ్గరకు వచ్చి ఎందుకు పలకరించడం లేదని ప్రశ్నించారు. కూల్చివేతల్లో ప్రభుత్వం తప్పు లేకపోతే ఖమ్మం ఆర్డీవోను ఆఘమేఘాలమీద ఎందుకు బదిలీ చేశారో చెప్పాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు.
ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని విమర్శించారు. నిర్వాసితులు ఐక్యంగా లేకపోతే, మంత్రులు చిచ్చు పెట్టే అవకాశం ఉందని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని, వేరే చోట ఖాళీ జాగాలు చూపిస్తామని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మి, వారు చెప్పే కాగితాలపై సంతకాలు చేసి మరోసారి మోసపోవద్దని సూచించారు. 100 గజాల్లో ఇండ్లు కట్టుకున్నోళ్లు మాఫియా కాదన్నారు. నిర్వాసితుల తరఫున న్యాయస్థానంలో, శాసన మండలి, అసెంబ్లీలో పోరాటాన్ని సాగిస్తామన్నారు.
