పార్లమెంట్ ఎన్నికలకు రెడీగా ఉండాలె.. బీఆర్ఎస్​ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

పార్లమెంట్ ఎన్నికలకు రెడీగా ఉండాలె.. బీఆర్ఎస్​ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో  కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్​ కార్పొరేటర్లకు, పార్టీ శ్రేణులకు ఆ​ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. పార్లమెంట్ ఎన్నికలకు రెడీగా ఉండాలని సూచించారు. గురువారం తెలంగాణ భవన్ లో  కార్పొరేటర్లతో  కేటీఆర్ గంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  నగరంలో బీఆర్ఎస్​ పటిష్టంగా ఉందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగరేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలతో నిరాశ పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల తరఫున బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని విమర్శించారు. జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్..​ పార్టీ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలానే నిరంతరంగా కృషి చేస్తుందని తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ బీఆర్ఎస్​ అని కేటీఆర్ పేర్కొన్నారు.