ఫోన్ ట్యాపింగ్.. సిల్లీ కేసు : కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్.. సిల్లీ కేసు : కేటీఆర్
  • ఇందులో తప్పేమీ జరగలేదని సిట్​వాళ్లకు అర్థమై ఉంటుంది: కేటీఆర్​
  • ఫోన్​ ట్యాపింగ్​ అంతా బోగస్​ అని కేసీఆర్​ చెప్పి ఉంటరు
  • ప్రతి ప్రశ్నకు కుండబద్ధలు కొట్టినట్టు సమాధానాలు చెప్పారని కామెంట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌ ట్యాపింగ్.. ఓ సిల్లీ కేసు అని బీఆర్ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. అటెన్షన్​ డైవర్ట్​ చేయడం, పాలనలో తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం​ఈ ఎంక్వైరీ నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు.  ఫిబ్రవరి 1న ఏటా కేంద్రం బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెడుతుందని, అందులో రాష్ట్రానికి గుండుసున్నా ఇస్తారని, దానిని డైవర్ట్​ చేయడానికే  సిట్​ విచారణ పేరుతో డ్రామాలు చేశారన్నారు.

‘‘కాంగ్రెస్​, బీజేపీలకు8 మంది చొప్పున ఎంపీలున్నా రాష్ట్రానికి గత రెండు బడ్జెట్‌‌‌‌లో దక్కింది సున్నా..ఇప్పుడు బడ్జెట్​లో వచ్చేది కూడా సున్నా అనే విషయం వారికి తెలుసు. అందుకే వాళ్ల అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఈ అటెన్షన్​ డైవర్షన్​ డ్రామా ఆడారు. రెండేండ్ల నుంచి ఈ కేసులో ఏమీ చేయలేకనే.. ఆగమేఘాలమీద కేసీఆర్​కు నోటీసులిచ్చి విచారణ చేశారు” అని అన్నారు. కేసీఆర్​ సిట్​ విచారణ అనంతరం ఆదివారం  హైదరాబాద్‌‌‌‌లోని నందినగర్​ నివాసంలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం, సిట్​ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, కానీ, కేసీఆర్​ చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో విచారణకు హాజరయ్యారని చెప్పారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని, కోర్టుకు వెళ్తే ఎర్రవల్లికే వచ్చి విచారణ చేసేందుకు అవకాశం దొరికేదని పేర్కొన్నారు. తానేం తప్పు చేయలేదన్న ఉద్దేశంతోనే ఇక్కడకు విచారణకు వచ్చారన్నారు. సిట్​ అడిగిన ప్రతి ప్రశ్నకు కుండబద్ధలు కొట్టినట్టు సమాధానం చెప్పారన్నారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను సిట్​వాళ్లు ట్యాపింగ్​ జరిగిందా? అని అడిగి ఉంటారని, అందుకు ఆయన అంతా బోగస్​ అని సమాధానం చెప్పి ఉంటారని తెలిపారు. అడిగిందే అడగడం, తిప్పితిప్పి అడగడం.. టైంపాస్​ తప్ప ఈ కేసులో ఏమీ లేదని చెప్పారు. ఇది సిల్లీ కేసు అని మరోసారి చెప్తున్నానన్నారు. ఈ విచారణతో ఎలాంటి తప్పు జరగలేదని సిట్​ అధికారులకు తేటతెల్లమై ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించేలా రెండేండ్లుగా లీకులు ఇస్తూ కాంగ్రెస్​ ప్రభుత్వం పైశాచికానందం పొందుతున్నదన్నారు. 

విదేశీ యాత్రల్లో సీఎం బిజీ

కేంద్ర బడ్జెట్‌‌‌‌లో రాష్ట్రానికి బీజేపీ సర్కారు ఎంగిలి మెతుకులు కూడా విదిలించలేదని కేటీఆర్​ విమర్శించారు. దీనిపై ప్రశ్నించాల్సిన సీఎం విదేశీ యాత్రల్లో బిజీగా ఉన్నారన్నారు. ఆయన తన పర్వర్ట్​ కోరికలను నెరవేర్చుకునే కార్యక్రమాలను చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్​ ఎన్నికల్లో తమ ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్‌‌‌‌ను డైవర్ట్​ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. సిట్​ విచారణ ఎవరి నాయకత్వంలో జరుగుతున్నదో అర్థం కావడం లేదని, విచారణ చేస్తున్నది పీసీసీ చీఫ్​ మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్​ ఆదేశాలతోనా? లేదంటే బీజేపీ ఆదేశిస్తే జరుగుతున్నదా? అని ప్రశ్నించారు. సిట్​విచారణకు మహేశ్​ చైర్మన్​ అయితే.. ఏదో ఒకటి ప్రకటించుకోవచ్చన్నారు.

సిట్​వాళ్లకన్నా ఎక్కువ ఆయనే మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీని, సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలిస్తే లోక్​భవన్​ ముందు సీఎం, కాంగ్రెస్​ నేతలు ఎందుకు ధర్నాలు చేశారని నిలదీశారు. తమ నాయకుడిని కూడా విచారణల పేరుతో వేధిస్తున్నారు కాబట్టే తాము కూడా ధర్నాలు చేశామని చెప్పారు. ఆయన్ని పట్టుకొని పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్‌‌‌‌గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఆయన్ని గుండెల్లో నింపుకున్న వాళ్లు బయటకొచ్చి ధర్నాలు చేయడంలో తప్పేముందని అన్నారు.  కేసీఆర్ రెండుసార్లు ప్రజలు ఎన్నుకున్న పాపులర్​ సీఎం అని ఉద్యమ నాయకుడు అని చెప్పారు. అట్లాంటి కేసీఆర్ మీద చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

శాంతి భద్రతలు దిగజారిపోయినయ్​

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని కేటీఆర్​ ఆరోపించారు. కోఠిలో ఉదయం 8 గంటలకు తుపాకీతో కాల్చి.. లక్షల రూపాయలు దోపిడీ చేశారన్నారు. ఎక్సైజ్​ కానిస్టేబుల్​ సౌమ్యపై గంజాయి స్మగ్లర్లు కారు ఎక్కించి చంపేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. మేడారం జాతరలో అధ్వాన్నమైన ఏర్పాట్లున్నాయని భక్తులు ఆరోపిస్తున్నా.. మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు.