మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. గురువారం జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. జీవన్ రెడ్డి వంటి నిఖార్సైన నేతలను కాంగ్రెస్ అవమానిస్తోందని అన్నారు. జీవన్ రెడ్డిని కేసీఆర్ సూచన మేరకు మా సహచరులందరితో కలిసి సాదరంగా ఆహ్వానించేందుకు వచ్చామని అన్నారు.
2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించారని.. కానీ, నిబద్ధత గల నాయకుడిగా ఆయన కాంగ్రెస్ తోనే కొనసాగారని అన్నారు కేటీఆర్. కేసీఆర్, జీవన్ రెడ్డి బంధం ఈనాటిది కాదని అన్నారు. జూన్ 2, 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక మొట్టమొదటి సారి జగిత్యాలకు వచ్చారని.. ఆరోజు బోర్నపల్లి బ్రిడ్జి గురించి జీవన్ రెడ్డి కేసీఆర్ ను అడిగారని... ఆయనడిగిందే తడవుగా కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి సాంక్షన్ ఇచ్చారని అన్నారు కేటీఆర్.
షుగర్ ఫ్యాక్టరీపై జీవన్ రెడ్డి ఫైట్ చేశారని.. ఆ క్రమంలోనే కేసీఆర్ మహారాష్ట్ర తరహా కో ఆపరేటివ్ సొసైటీ పద్ధతిలో పెడదామన్నారని.. పార్టీ బలోపేతానికి జీవన్ రెడ్డి చేరిక బాగుంటుందని జగిత్యాల నాయకత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు కేటీఆర్. కాలం నెట్టుకొచ్చే ప్రభుత్వం ఇది అని..మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని అన్నారు కేటీఆర్. 70 లక్షల కోట్లు రైతులకు బకాయి పడ్డారని.. బాసరలో ముఖ్యమంత్రి భాష అసహ్యంగా ఉందని అన్నారు.
