మెగా డీఎస్సీ అని చెప్పి దగా చేస్తారా...కేటీఆర్

మెగా డీఎస్సీ అని చెప్పి దగా చేస్తారా...కేటీఆర్
  • అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా

డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులను, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులను అరెస్ట్ చేయటాన్ని బీఆర్ఎస్‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని చెప్పి ఇప్పుడు వారిని దగా చేస్తారా? అని ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తొలి కేబినెట్‌‌‌‌లోనే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చి తొమ్మిది నెలలు కావస్తోన్న ఎందుకు నెరవేర్చలేదని  సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిల‌‌‌‌దీశారు. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు కొలువుదీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా ? అని మండిపడ్డారు. ఉస్మానియా విద్యార్థులన్నా.. అక్కడ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులన్నా ఎందుకంతా కోపమో చెప్పాలన్నారు.

కాంగ్రెస్ సర్కార్‌‌‌‌ను భుజాన మోసిన సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారని..ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయో చెప్పాలని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా డీఎస్సీ పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలని కేటీఆర్ కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల డిమాండ్లకు మద్దతు తెలిపిన రేవంత్‌‌‌‌రెడ్డి, ఇప్పుడెందుకు వారి డిమాండ్లను నెరవేర్చడం లేదని మరో ప్రకటనలో హరీశ్‌‌‌‌ సీఎంను ప్రశ్నించారు.