
‘‘కాంగ్రెస్ వాళ్లు రాహుల్ పీఎం అవుతాడంటే, బీజేపీ వాళ్లు మోడీ అంటున్నారు. కానీ మోడీనో, రాహుల్‌నో ఎంచుకోవాల్సిన కర్మ దేశ ప్రజలకు పట్టలేదు. వారిద్దరూ (కాంగ్రెస్+బీజేపీ) కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారి దేశ రాజకీయాలను శాసించబోతున్నాయి’’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌ను 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే, కేంద్రం మెడలు వంచి రాష్ర్టానికి నిధులు రాబడతామన్నారు. రెండు ఎంపీ సీట్లతోనే కేసీఆర్ స్వరాష్ర్టకలను సాకారం చేశారని గుర్తుచేశారు.
మోడీకి బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
నరేంద్ర మోడీ ఏదో ఉద్ధరిస్తారని 2014 ఎన్నికల్లో 283 సీట్లు ఇచ్చిగెలిపిస్తే ఎవరి చీపురు వాళ్ల చేతిలో పెట్టి ఊడ్చుకోమనడమే తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు బిల్డప్, ప్రచార ఆర్భాటమే తప్ప మరో యావలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ కోరి, మూడేండ్లవుతున్నా మోడీకి దున్నపోతుపై వానపడ్డట్టుగా కూడా లేదని అన్నారు. తెలంగాణకు రూ.24 వేల కోట్ల నిధులివ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్‌ఎస్‌ను ఓడించలేకపోయామని మోడీ, రాహుల్, చంద్రబాబు తలలు పట్టుకున్నారన్నారు. చేసేదేంలేక కేసీఆర్ పెట్టిన రైతుబంధును ఇటు మోడీ, అటు చంద్రబాబు పేర్లు మార్చి కాపీ కొట్టారన్నారు. పాలమూరు పచ్చి కట్టె.. అంటుకుంటే ఇడువదు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామని కేటీఆర్ తెలిపారు.
వలసలు బంద్ అవడంతోపాటు కొత్త హరిత విప్లవం పాలమూరు జిల్లాతోనే మొదలుకావాలన్నారు. ‘‘పాలమూరు ప్రజలు పచ్చి కట్టె లెక్క. అంత తొందరగా అంటుకోరు. అంటుకుంటే ఇడ్వరు. ఉమ్మడి జిల్లాలో 14 సీట్లకు 13 సీట్లలో టీఆర్ఎస్‌ను గెలిపించిన ప్రజలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా. ఆ జిల్లాలో ఎగిరెగిరిపడ్డ కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడెక్కడున్నరో అందరికీ తెలుసు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పాలమూరు ప్రజలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. ఎన్నికలు పూర్తయినంక కొత్త పింఛన్లు, నిరుద్యోగ భృతి సహా పలు పథకాలు అమల్లోకి తీసుకొస్తాం’’ అని చెప్పారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ జెడ్పీటీసీ బాబు, మాజీ జెడ్పీటీసీ, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు విశ్వేశర్ రెడ్డి , పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, వందల సంఖ్యలో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇందులో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.