
- బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో పది మంది ఓడిన్రు: హరీశ్‌రావు
- ప్రజలకు దూరమైనందునే ఓడిపోయామని కామెంట్
- ఢిల్లీలో కేటీఆర్‌తో కలిసి రిపోర్టర్లతో చిట్‌చాట్
- ఓటమికి జనాలను నిందించలేం.. మా వైఖరే మారాలి: కేటీఆర్
- ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు:పార్టీ ఫిరాయింపుల వల్ల తమ పార్టీకి నష్టమే తప్ప, లాభం జరగలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇతర పార్టీల్లో నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో పది మంది ఓడిపోయారని వెల్లడించారు. అయితే, పార్టీ ఫిరాయింపుల విషయంలో తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించామని, 2/3 ఎమ్మెల్యేలను ఒకేసారి విలీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఒక్కో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కండువా కప్పుతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని వ్యాఖ్యానించారు.
మంగళవారం హరీశ్ రావు ఢిల్లీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. అనంతరం రిపోర్టర్లతో చిట్ చాట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తలుపులు తెరిచారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల్లో నుంచి 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఎన్నడూ అనలేదని చెప్పారు. ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా చూస్తున్నారని, తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులేని పార్టీలు ఇబ్బందులు పడ్డాయని హరీశ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలోకి టీడీపీ వస్తే కచ్చితంగా బీఆర్‌ఎస్‌కు మేలు జరుగుతుందని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును రేవంత్‌రెడ్డి ట్రాప్ చేశారని ఆరోపించారు. తాను కేసీఆర్‌ను ఫాలో అవుతానని హరీశ్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేండ్లు టైం ఇస్తామని, ఆ తర్వాత ప్రజా సమస్యలపై ధర్నాలు, పాదయాత్రలు, ర్యాలీలు చేపడుతామని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలని కోరారు. రాష్ట్రంలో పాలనపై రేవంత్‌కు పట్టు రాలేదని అన్నారు.
మేం వైఖరి మార్చుకోవాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించడమంటే అది తమ తప్పే అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలతో గ్యాప్ రావడం వల్లే ఓడిపోయామని, తమ వైఖరి మార్చుకోవాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం కూడా ఓటమికి ఓ కారణమేనని చెప్పారు. హైదరాబాద్‌లో అభివృద్ధి కండ్ల ముందు కనిపించిందని, అందుకే నగరంలోని అన్ని సీట్లు గెలిచామని తెలిపారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పేరు తీసేయడం వల్లే ఓడిపోయామన్న వాదనలను కేటీఆర్ తోసిపుచ్చారు.
ఏపీ ఎన్నికల ఫలితాలు కూడా తనను ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పారు. పెద్ద ఎత్తున పథకాలు అమలు చేసినా ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చరం కలిగించిందని అన్నారు. జనసేన విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని కామెంట్ చేశారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి(ధర్మవరం మాజీ ఎమ్మెల్యే) ఓడిపోయారని, సంచులతో దొరికిన రేవంత్ సీఎం అయ్యారని కేటీఆర్ అన్నారు. జగన్‌ను ఓడించడానికి షర్మిలను ఒక వస్తువులా వాడుకున్నారని, అంతకుమించి షర్మిల ఏమీ చేయలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమది అహంకారం కాదని, ఆత్మ విశ్వాసం అని ఆయన వ్యాఖ్యానించారు.
రాహుల్‌ది ద్వంద్వ వైఖరి
పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని కేటీఆర్ అన్నా రు. ఓవైపు రాజ్యాంగాన్ని రక్షిస్తామని, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తామని చెబుతూనే, మరోవైపు తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఫిరాయింపులను రాహుల్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయం కోసం ఢిల్లీలో 4 రోజులుగా న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. బీఆర్ఎస్ గుర్తు పై గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
రాష్ట్రపతిని కలుస్తం
పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇప్పటికే హైకోర్టు లో పిటిషన్ వేశామని కేటీఆర్ తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్, రాజ్య సభ చైర్మన్ కు కంప్లైంట్ చేస్తామని చెప్పారు. రాజ్యసభలోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతామని, అవకాశం ఉన్న అన్ని వేదికల్లో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ బాధిత పార్టీలతో కలిసి భవిష్యత్ లో పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేసేందుకు పోరాటం చేస్తామని అన్నారు. పాంచ్ న్యాయ్ లో కాంగ్రెస్ చెప్పిన విధంగా పార్టీ మారగానే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తేవాలని కేటీఆర్ కోరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ పై పోరాటం లో ఇది తొలి అడుగు మాత్రమేనని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు.