తెలంగాణ ఉద్యమంలో తన అరుదైన కళా నైపుణ్యంతో.. తన గాత్రంతో అలరించిన తమ్ముడు సాయిచంద్ మరణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఉద్యమ సహచరుడు సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. హైదరాబాద్ లో ఉండి ఉంటే బ్రతికే వాడేమో భావోద్వేగానికి లోనయ్యారు. స్వగ్రామానికి వెళ్ళడంతో అక్కడే ఈ ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
39 ఏండ్ల సాయిచంద్ జూన్ 28న బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు.
సాయిచంద్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 29న గురువారం మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. సాయిచంద్ అంతిమయాత్ర తమ స్వగృహం గుర్రంగుడా నుండి ప్రారంభమై బీఎన్ రెడ్డి నగర్ లోని సాహెబ్ నగర్ వరకూ సాగనుంది. సాహెబ్ నగర్ స్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
