ఈ నిషేధం లీకులను ఆపదు.. ఇది 15 కోట్ల మందికి శిక్ష: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్‎పై పావెల్ దురోవ్ రియాక్షన్

ఈ నిషేధం లీకులను ఆపదు.. ఇది 15 కోట్ల మందికి శిక్ష: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్‎పై పావెల్ దురోవ్ రియాక్షన్

న్యూఢిల్లీ: నీట్-యూజీ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‎‎పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని ఆ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్ణయం అసలు సమస్యను అరికట్టకుండా లక్షలాది సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిషేధం పేపర్ లీకులను ఆపలేదని.. కేవలం పేపర్ లీకులు టెలిగ్రామ్ నుంచి ఇతర యాప్‌లకు తరలిపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘కొందరు వినియోగదారులు లీకైన పరీక్ష ప్రశ్నలను షేర్ చేశారన్న కారణంతో భారత ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌ను ఒక వారం పాటు నిషేధించింది. ఇది భారతదేశంలోని 15 కోట్లకు పైగా సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులను శిక్షిస్తుంది. అంతేగానీ పేపర్ లీక్ చేసిన వ్యక్తులను కాదు. ఈ నిషేధం దేన్నీ ఆపలేదు. భారత ప్రభుత్వ నిర్ణయంతో లీకులు టెలిగ్రామ్ నుంచి ఇతర యాప్‌లకు తరలిపోతాయి’’ అని పావెల్ దురోవ్ పేర్కొన్నారు.

కాగా, నీట్-యూజీ (NEET-UG) రీ-టెస్ట్ నేపథ్యంలో మెసేజింగ్ ప్లాట్‎ఫామ్ టెలిగ్రామ్‎పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. జూన్ 16 నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వంటి అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఎన్టీఏ సిఫార్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.