- పదేండ్ల పాలనలో కార్యకర్తలు, ఉద్యమకారులను పట్టించుకోలే
- వచ్చే ఐదేండ్లు కార్యకర్తల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్త: కేటీఆర్
హనుమకొండ, వెలుగు: రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చివరి గింజ వరకూ కొంటామని, అవసరమైతే కేంద్రం మీద యుద్ధం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్నీ రివర్స్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ఎంత చెబితే అంతే కొనాలన్న కేబినెట్ నిర్ణయంతో రైతులు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండ, పరకాల నియోజకవర్గం దామెరలో సోమవారం వేర్వేరుగా నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్, సోషల్ మీడియా శిక్షణ తరగతులకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రూ. 2.8 లక్షల కోట్ల అప్పు చేసి రైతులకు సంక్షేమ పథకాలు అందించారని, కాంగ్రెస్ రెండున్నరేండ్లలో రూ. 4 లక్షల కోట్లు చేసిందని, ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుబంధు బంద్ అయి.. రాహుల్ గాంధీ బంధు నడుస్తోందన్నారు.
కేసీఆర్ లేకపోతే రాష్ట్రమే లేదని, ఆయనపై విష ప్రచారం చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన శని అని, సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆ పార్టీని ఎప్పుడు తరిమికొడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఢిల్లీ చేతుల్లో పాలన పెడితే నష్టపోతామని మొదటినుంచీ చెబుతున్నామని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీకి గులాములేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 73 సార్లు ఢిల్లీకి పోయి 70 పైసలైనా తీసుకొచ్చిండా అని ప్రశ్నించారు.
గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయితే.. రేవంత్ రెడ్డి పాలన మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. 'బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అభివృద్ధిపై దృష్టి పెట్టి కార్యకర్తలు, ఉద్యమకారులను పట్టించుకోలేదు. ఈ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినయ్. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతది. కేసీఆర్ మళ్లీ సీఎం అయితడు. ఇకపై కార్యకర్తలు, ఉద్యమకారుల బాధ్యత నేనే తీసుకుంటా. వచ్చే ఐదేండ్లు కార్యకర్తల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా'అని కేటీఆర్ చెప్పారు.
కార్యకర్తల ఆర్థికపరమైన అంశాలు, పదవుల బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ ఉండదని, తమ పార్టీ కార్యకర్తలను కేసులతో ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ నేతలు, అధికారులకు సినిమా చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. సప్త సముద్రాలు దాటివెళ్లినా ఎవరినీ విడిచిపెట్టబోనని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు
