- మేమే ప్రత్యామ్నాయం: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో పల్లె జనమంతా గులాబీ పార్టీకే జై కొట్టారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నో అరాచకాలకు పాల్పడింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టినా ఘోర పరాజయం ఎదురైంది. అధికార పార్టీకి గ్రామాల్లో కౌంట్ డౌన్ మొదలైంది’’అని ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు ఆయన అభినందనలు తెలిపారు.
రేవంత్ సర్కార్ రెండేండ్ల వైఫల్యాలకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ‘‘పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు ఇది అద్దం పడుతున్నది. సగం సీట్లు కూడా గెలవలేక, చాలా చోట్ల కేవలం 10, 20 ఓట్ల తేడాతో బయటపడటం చూస్తుంటే కాంగ్రెస్ పతనం మొదలైనట్టే. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే” అని పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్ర పర్యటనలో ఉన్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేటీఆర్, హరీశ్ రావుతో నందినగర్ లో సమావేశమయ్యారు. త్వరలో అఖిలేశ్ యాదవ్ కేసీఆర్‌తో భేటీ అవుతారని కేటీఆర్ తెలిపారు.

