
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిపై ఆయన స్పందించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ను కూడా ఇవ్వలేదని తెలిపారు.
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ను ప్రకటించిందని.. ఆ క్యాలెండర్లో పేర్కొన్న పది తేదీలు ఇప్పటికే అయిపోయాయని చెప్పారు. ఆదివారం రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే 7 నెలల కాలం గడిచిపోయిందని, మిగిలిన 5 నెలల కాలంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ విధంగా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన నాయకులు, తెలంగాణ ప్రభుత్వం ఈ ఉద్యోగాల భర్తీ గురించి బాధ్యత తీసుకోకపోవడంతోనే రాహుల్ గాంధీని ఈ విషయంలో ప్రశ్నిస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.