ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలి : కేటీఆర్

ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలి : కేటీఆర్
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడ్తం: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​డిమాండ్ చేశారు. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడ్తామన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. సోమవారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్​ఎస్ కౌన్సిలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నది రాహుల్​ఇచ్చిన హామీ కాబట్టి.. ప్రైవేట్ బిల్లు పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వకతప్పదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రైతుబంధు స్థానంలో ‘రాహుల్ బంధు’.. 

సీఎం రేవంత్ రెడ్డి.. రైతుబంధు స్థానంలో ‘రాహుల్ బంధు’ అనే కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను ఏడాదికి వెయ్యి కోట్లు రాహుల్ గాంధీకి పంపుతున్నారని కేటీఆర్​విమర్శించారు. రేవంత్ రెడ్డి సామంతరాజులాగా ఢిల్లీపెద్దలకు కప్పం కడుతుడన్నారని, అందుకోసం పేదల భూములు గుంజుకుంటున్నాడని, హైదరాబాద్​ నుంచి ఖమ్మం దాకా పేదల ఇండ్లు కూలగొట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని మండిపడ్డారు.

హైదరాబాద్​లోని చెరువుల బఫర్ జోన్ లో ఉన్న మంత్రుల ఇండ్లను ఎందుకు కూల్చరని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన సొంత ఊళ్లో కట్టుకున్న ఇల్లు రెడ్డికుంట చెరువు బఫర్ జోన్ లోనే ఉందని.. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా దుర్గం చెరువు శిఖంలోనే ఉందన్నారు. హైదరాబాద్​లో పలువురు మంత్రుల ఇండ్లు శిఖం, బఫర్​లో ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చరని కేటీఆర్​ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలకొట్టడమేనా? అని ఎద్దేవా చేశారు.