వాళ్ల హయాంలో కరెంట్ కూడా సక్కగ ఇయ్యలే..

వాళ్ల హయాంలో కరెంట్ కూడా సక్కగ ఇయ్యలే..

నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్​ నాయకత్వంలో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి అనే జోడెడ్లతో రాష్ట్రం ముందుకెళుతోందని ఐటీ, మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. పెద్దపెద్ద మాటలంటున్న ఇప్పటి ప్రతిపక్ష నేతలు.. అప్పట్లో కనీసం కరెంట్​ ఇచ్చిన పాపానపోలేదన్నారు. ఇప్పుడేమో గొంతు చించుకుని రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చినంక టీఆర్​ఎస్​ ప్రభుత్వం 24 గంటలు ఫ్రీ కరెంట్​ఇవ్వడంతో పాటు రైతు చనిపోయిన వారంలోనే రూ.5 లక్షల పరిహారం ఇస్తోందన్నారు. శుక్రవారం నల్గొండలోని పాలిటెక్నిక్​ కాలేజీలో మంత్రులు వేముల ప్రశాంత్​ రెడ్డి, జగదీశ్​రెడ్డిలతో కలిసి ఆయన ఐటీ హబ్​కు శంకుస్థాపన చేశారు. అప్పటి నాయకులు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్​ సమస్యను పట్టించుకోనేలేదని, కేసీఆర్​ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మిషన్​ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించిందని అన్నారు. నల్గొండ ఐటీ హబ్​ కూడా కేసీఆర్​ పుణ్యమేనన్నారు. 16, 17 నెలల్లో నల్గొండ ఐటీ హబ్​ అందుబాటులోకి వస్తుందని, అప్పటి వరకు తాత్కాలిక బిల్డింగ్​లో సెంటర్​ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

జాబ్​లు ఇయ్యలేదని నిరూపిస్తే రాజీనామా చేస్త: ప్రశాంత్​ రెడ్డి 
రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపక్షాలకు ప్రశాంత్​రెడ్డి సవాల్​ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో  ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. టీఎస్​ఐపాస్​ ద్వారా కొత్తగా 17 వేల ఇండస్ట్రీలు వచ్చాయని, వాటి ద్వారా 12 లక్షల నుంచి 13 లక్షల మందికి ఉపాధి దొరికిందని అన్నారు. గతంలో ‘ఐ’, ‘టీ’ అంటే ఏంటో కూడా తెలియనోళ్లు ఐటీ మంత్రులుగా పనిచేశారని జగదీశ్​రెడ్డి అన్నారు.

నల్గొండ రూపు రేఖల్ని మారుస్తం 
నల్గొండ రూపు రేఖల్ని పూర్తిగా మార్చేస్తామని మంత్రి కేటీఆర్​ అన్నారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు నల్గొండ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కరోనా వల్ల నల్గొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు లేట్​ అయ్యాయని చెప్పారు. సీఎం హామీ మేరకు కేటాయించిన రూ.100 కోట్ల నిధుల్లో ప్రస్తుతం రూ.70 కోట్లు విడుదల చేస్తామని, త్వరలోనే మిగతా రూ.30 కోట్లను రిలీజ్​ చేస్తామని చెప్పారు. కొత్తగా ఐదు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.4.50 కోట్లతో వెజ్​, నాన్​వెజ్​ మార్కెట్లు, రూ.3 కోట్లతో వైకుంఠధామాలను కడతామన్నారు.