కేసీఆర్​ ను మళ్లీ సీఎం చేయడం చారిత్రక అవసరం

కేసీఆర్​ ను  మళ్లీ సీఎం చేయడం చారిత్రక అవసరం
  • ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం: కేటీఆర్ 
  • కాంగ్రెస్​ ను  గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నం 
  • చంద్రబాబు మంచి పాలన చేసిండు.. ఐటీ కంపెనీలు తెచ్చిండు 
  • చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కామెంట్ 

హైదరాబాద్ వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఓడిపోవడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించడంతో తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయ్యిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్ని కల్లో కేసీఆర్​ ను  సీఎంగా చేసుకోవడం చారిత్రక అవ సరమని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్​ లో  రాజేంద్రనగర్​కు  చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్​ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ పాలన 'అహ నా పెళ్లంట' సినిమాలో కోడి కథలా తయారైందని విమర్శించారు. 

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మంచి పనులు ఎవరు చేసినా అభినందించాల్సిందేనని అన్నారు. "వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అలాగే చంద్రబాబు మంచి పాలన చేశారు. ఐటీ కంపెనీలను తీసుకొచ్చి, ఆ రంగాన్ని అభివృద్ధి చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. దండయాత్రలు చేసిన రాజులు కూడా ఇలా ఆనవాళ్లు లేకుండా చేస్తామని అనరు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేస్తామంటే రాచరికం అన్నట్లే లెక్క" అని మండిపడ్డారు. 

కాంగ్రెస్ నాయకుల మాటలు పెద్దవి.. చేతలు చిన్నవని కేటీఆర్ విమర్శించారు. నా భూములు ఏడున్నయో చెప్పండి.. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్న ప్రభు త్వం.. కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లో ఉన్నా ముట్టుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. గుంపు మేస్త్రి అంటే కట్టెటోడని, ఈ గుంపు మేస్త్రి మాత్రం కూల్చేటోడని రేవంత్​ను ఉద్దేశించి విమర్శించారు. 

"ప్రభుత్వం చేస్తున్నవన్నీ నెగెటివ్ పనులే. ఫ్రీ బస్ పెట్టి ఆడబిడ్డలు తన్నుకునే పరిస్థితి తెచ్చారు. అత్తాకోడళ్లకు పంచాది పెట్టారు" అని అన్నారు. “రాజేంద్రనగర్లో నాకు భూములు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అక్కడ నాకు భూములు ఉన్నాయనే ఎయిర్​ పోర్టు మెట్రోని రద్దు చేశారంట. నాకు ఎక్కడ భూములు ఉన్నాయో చూపించాలి" అని సవాల్ విసిరారు. "ఇచ్చిన హామీలకు పైసలు లేవంటున్న ప్రభుత్వం. మూసీ ప్రక్షాళనకు రూ.లక్ష కోట్లు ఖర్చుచేస్తామంటున్నది. ప్రక్షాళనమంచిదే.. కానీ హామీలను పక్కనబెట్టి చేసుడెందుకు? మింగ మెతుకు లేదు గాని మీసాలకు  సంపెంగ నూనె కావాలన్నాడట ఒకడు. కాంగ్రెస్ పాలన కూడా అట్లనే ఉన్నది. ఫిబ్రవరి నెలలో 31 ఉండదన్నది ఎంత నిజమో.. రేవంత్ రెడ్డి మాటలు కూడా అంతే" అని విమర్శించారు.

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. 

మతం పేరు ఎత్తకుండా ఓట్లు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ నాయకులు అంటున్నా రని, హిందువులు ప్రమాదంలో ఉంటే మోదీ విఫలమై నట్లేగా అని ప్రశ్నించారు. 11 ఏండ్లుగా ప్రధాని మోడీ రాష్ట్రానికి చేసేందేమీ లేదు. మీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవు, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ చార్జ్ షీట్​ వేస్తే సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ ఉన్నారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణా మాలకు ఇది సంకేతమా? తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ శత్రువులే, బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్​ ను  లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాయి. తెలంగాణ ప్రజలకు గులాబీ జెండానే రక్షణ కవచం" అని అన్నారు. చేవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాల కు ఉప ఎన్నికలు ఖాయమని కామెంట్ చేశారు.