నిరుద్యోగులను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తుండు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

నిరుద్యోగులను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తుండు :  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులను తప్పు దోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. పదేండ్లలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగులను పట్టించుకోకుండా, వారిని కలవకుండా ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారన్నారు. శనివారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చాక జీవో 46, 317 జీవో లో సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని, హామీల అమలు కోసం యువ నాయకులం బాధ్యత తీసుకుంటామన్నారు. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. మండలిలో తాను, మల్లన్న వారి సమస్యలు ప్రస్తావించి పరిష్కరించేలా చొరవ చూపుతామన్నారు. కోడ్ ముగిసిన తరువాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఈ విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని అన్నారు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్లు కాదని, అపాయింట్ లెటర్ ఇస్తేనే ఉద్యోగం ఇచ్చినట్లని వెంకట్ స్పష్టం చేశారు. 

ఎన్నికలకు ముందు 30 వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని, అప్పుడు ఎవరు అడ్డుకున్నారని కేటీఆర్​ను ఆయన ప్రశ్నించారు. మూడు నెలల్లో మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై తాను బహిరంగ చర్చకు రెడీ అని, మీరు పదేండ్లలో చేసిన వాటిపై చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు.  ఫీజుల నియంత్రణ కమిటీ సూచించినట్టుగా ఫీజు లు ఉండేలాగా సీఎంను కోరుతానని చెప్పారు.