కేటీఆర్​ది సీఎం రేవంత్​రెడ్డి స్థాయి కాదు : తుమ్మల నాగేశ్వరరావు

కేటీఆర్​ది సీఎం రేవంత్​రెడ్డి స్థాయి కాదు : తుమ్మల నాగేశ్వరరావు

కూకట్​పల్లి, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డిపై పోటీ చేసే స్థాయి కేటీఆర్​కి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దమ్ముంటే మల్కాజిగిరి లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి సాధారణ కార్యకర్తను బరిలో దింపుతామని కేటీఆర్​కు సవాల్ ​విసిరారు. పదేండ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న బీఆర్ఎస్​ లీడర్లను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు జిమ్మిక్కులు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. గురువారం సాయంత్రం కేపీహెచ్​బీ కాలనీలో కూకట్​పల్లి నియోజకవర్గ కాంగ్రెస్​ఇన్​చార్జ్ బండి రమేశ్ అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 

అనంతరం టెంపుల్ బస్టాప్​వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల అతిథిగా పాల్గొని మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన బీఆర్ఎస్​ పార్టీని లోక్​సభ ఎన్నికల్లో ఓడించి, కాంగ్రెస్​ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బండి రమేశ్​ మాట్లాడుతూ బీఆర్ఎస్​పాలనలో కూకట్​పల్లిలో చేసిన అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నామన్నారు. అక్రమార్జనకు పాల్పడిన వారు తగినమూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మేడ్చల్– మల్కాజిగిరి  జిల్లా డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్థన్​రెడ్డి, నాయకులు కొప్పిశెట్టి దినేశ్​కుమార్, శేరి సతీష్​రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, గాలి బాలాజీ పాల్గొన్నారు. మంత్రి తుమ్మల సమక్షంలో సీనియర్ నాయకులు మేకల మైఖేల్, సంజీవరావు కాంగ్రెస్​లో చేరారు.