
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె అన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. సోమవారం జైల్లో కవితతో ఆయన ములాఖత్ అయ్యారు. దాదాపు 15 నిమిషాలు మాట్లాడారు. కవిత ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయపరంగా అందించాల్సిన సహాయంపై చర్చించారు.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్ఎస్!
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఈ విషయంలో గత రెండు రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లతో చర్చలు జరుపుతున్నారు. ఏయే అంశాలపై ప్రధానంగా పిటిషన్ దాఖలు చేయాలనే విషయంపై సలహాలు, సూచనలను తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే... ప్రస్తుతం దానం నాగేందర్ తో పాటు మరో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా? లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాలా అనే అంశాలపై అడ్వకేట్లతో కేటీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం.