కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్.. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు రెన్యువల్ సీఎం: కేటీఆర్

కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్.. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు రెన్యువల్ సీఎం: కేటీఆర్
  • ఢిల్లీకి ప్రతినెలా కప్పం కడుతూ సీటు కాపాడుకుంటున్నడు
  • రాహుల్.. నీ రైతు డిక్లరేషన్ ఏమైంది?.. మీ 34 హమీల నయవంచనకు నాలుగేండ్లు 
  • మేడిగడ్డ ప్రాజెక్ట్​ను బాంబు పెట్టి పేల్చిన్రు.. చెక్ డ్యాములు కూడా పేల్చుతున్నరు
  • వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్లు

వరంగల్‍, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి రెగ్యులర్‍ సీఎం కాదని, నెలకోసారి కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రెన్యువల్‍ సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‍ పార్టీ కరోనా వైరస్ కంటే డేంజర్‍ అని విమర్శించారు. వరంగల్‍ రైతు డిక్లరేషన్‍ అనేది ఒక బోగస్ అని.. చిత్తు కాగితంతో సమానమని 
మండిపడ్డారు. ఎన్నికలకు ముందు వరంగల్​లో రైతు డిక్లరేషన్‍ పేరుతో కాంగ్రెస్‍ చేసిన మోసానికి నాలుగేండ్లు నిండాయన్నారు. ఢిల్లీ నుంచి రాహుల్‍గాంధీ, గల్లీ నుంచి సీఎం రేవంత్‍రెడ్డి వచ్చి రైతు డిక్లరేషన్‍ పేరుతో 34 హామీలిచ్చారని, గ్యారంటీ కార్డులు, బాండ్‍ పేపర్లు అంటూ తియ్యటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లు 
దొబ్బారని ఆరోపించారు. 

బుధవారం వరంగల్​లోని హంటర్​ రోడ్డులో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన రైతు సంగ్రామ సదస్సు  నిర్వహించారు. కేటీఆర్‍ మాట్లాడుతూ.. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 900 రోజులైనా ఊ లేదు.. ఉప్పురాయి లేదని విమర్శించారు. ‘ఏమయ్యా రాహుల్‍గాంధీ.. నువ్వు చేసిన డిక్లరేషన్‍ ఎక్కడ సచ్చింది’ అని ప్రశ్నించారు. కేసీఆర్‍ ప్రభుత్వంలో రైతుబంధు ఒక విప్లవమన్నారు. ఐక్యరాజ్యసమితి రైతుబంధు స్కీమ్​ను మెచ్చుకొని కేసీఆర్​ను ప్రశంసించిందని చెప్పారు.

రుణమాఫీ నిరూపిస్తే.. రాజకీయాలు వదిలేస్త

రేవంత్‍రెడ్డి రైతుబంధును రాహుల్​బంధుగా మార్చాడని.. రైతుల డబ్బులను ఢిల్లీకి పంపిస్తున్నాడని కేటీఆర్‍ ఆరోపించారు. రేవంత్‍రెడ్డి రెగ్యూలర్‍ సీఎం కాదని, నెలకోసారి కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రెన్యూవల్‍ సీఎం అని విమర్శించారు. తమను మోసం చేసినట్టు గుర్తించిన  రైతులకు కోపం వస్తే రాహుల్‍గాంధీ, సోనియాగాంధీ,  ప్రియాంక గాంధీలను ఎవరూ కాపాడలేరన్నారు. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని రేవంత్​రెడ్డి లేఖలు రాశారని, చివరికి వారిని కూడా మోసం చేశాడన్నారు. కౌలు రైతులకు కాంగ్రెస్ రూ.22,500 కోట్లు బాకీ పడిందన్నారు. రుణమాఫీ కింద రైతులకు రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.12 వేల కోట్లిచ్చి మిగతా డబ్బులు ఎగవెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే ఒక్క ఊర్లో కూడా పూర్తిగా రుణమాఫీ జరగలేదని,  ఒక్క గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని సవాల్‍ చేశారు.

మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చిన్రు..

మేడిగడ్డపై హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రజలకు స్పష్టత వచ్చిందని, కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారం అంతా జూటా అని తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. ‘‘ఇప్పటి నుంచి ఎవడైనా కాంగ్రెసోడు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడితే.. చెప్పుతో కొట్టాలి” అని అన్నారు. కాంగ్రెస్​వాళ్లే మేడిగడ్డ బారేజీని బాంబులతో పేల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హుజురాబాద్‍లోనూ చెక్‍ డ్యామ్‍లను పేల్చారని ఆరోపించారు. యూరియా పంపిణీలో యాప్‍ల పేరుతో జరుగుతున్న నాటకాలు బంద్‍ చేయాలని, షాపుల్లోనే యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్‍ చేశారు. సదస్సులో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్‍, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, సిరికొండ మధుసూదనచారి, తక్కళ్లపల్లి రవీందర్‍రావు, మాజీ ఎంపీ వినోద్‍ కుమార్‍, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

ఆమోదించిన  తీర్మానాలు..

  •     రాష్ట్రంలో కాంగ్రెస్‍ పాలనలో ఆగమైన వెయ్యి మంది రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.
  •     రైతు డిక్లరేషన్‍లో ఇచ్చిన 34 హామీలను సంపూర్ణంగా అమలు చేయాలె.
  •     రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు సెంటర్ల వద్ద ఎటువంటి ఆంక్షలు లేకుండా మక్కలు, వరి, పత్తి కొనుగోలు చేసి క్వింటాల్​కు రూ.500 బోనస్‍ ఇవ్వాలి.
  •     రైతులకు మూడుసార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని వడ్డీతో సహా చెల్లించి. 
  • రూ.2 లక్షల రుణమాఫీ పెండింగ్‍ లేకుండా చెల్లించాలి.