వానొస్తే డల్లాస్, న్యూయార్క్​ కూడా మునుగుతయ్

వానొస్తే డల్లాస్, న్యూయార్క్​ కూడా మునుగుతయ్
  • దీనికే ప్రభుత్వంపై నిం దలేస్తరా?
  • వాన ఎంత పడ్తదో మాకు తెలుస్తదా?: మంత్రి కేటీఆర్
  • ప్రజలు, గత ప్రభుత్వాల తప్పిదాలతోనే ఈ పరిస్థితి
  • జీహెచ్ఎంసీ ఆఫీసర్లతో సమీక్ష

హైదరాబాద్, వెలుగుభారీ వర్షాలు కురిస్తే డల్లాస్, న్యూయార్క్​ నగరాలు కూడా నీటమునుగుతాయని, దీనికి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. వర్షాలు ఎక్కువగా కురిస్తే ఎంతపెద్ద నగరంలోకైనా నీళ్లు వస్తాయని చెప్పారు. ప్రజలు, గత ప్రభుత్వాల తప్పిదాలతోనే ప్రస్తుతం నగరంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ముంబైలో వర్షాలు పడ్డ సమయంలో తాను కూడా 24 గంటలు చిక్కుకున్నానని, మోకాళ్లలోతు నీటిలోంచి నడుకుంటూ వెళ్లానని చెప్పారు. హైదరాబాద్​లో కురుస్తున్న వర్షాలపై సోమవారం జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఏపీ, కర్నాటక నుంచి 38 బోట్లు

ఇప్పుడు హైదరాబాద్ లో 18 బోట్లు మాత్రమే ఉన్నాయని, మరో 38 బోట్లు ఏపీ, కర్నాటక నుంచి తెప్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 1908 తర్వాత నగరంలో ఇది రెండో అతి పెద్ద వర్షమని చెప్పారు. రానున్న రోజుల్లో వర్షాలు ఇంకా పడే అవకాశాలున్నాయని చెప్పారు. వ‌‌ర‌‌ద నేపథ్యంలో స‌‌హాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాల‌‌ని ప్రధాన మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, కేంద్రం కచ్చితంగా ఇస్తుందన్న భరోసా ఉందన్నారు. వ‌‌ర‌‌ద‌‌లతో న‌‌గ‌‌రంలో రూ.670 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు, నాలాలు, ఇత‌‌ర ఆస్తుల‌‌కు న‌‌ష్టం జ‌‌రిగిన‌‌ట్లు ప్రాథ‌‌మికంగా అంచ‌‌నా వేశామని తెలిపారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే రూ.60 కోట్లు ఖర్చు చేశామన్నారు. గ్రేటర్​లో మరణించిన 33 మందిలో ఇప్పటికే 29 మంది ఫ్యామిలీలకు నష్టపరిహారం కింద రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశామని కేటీఆర్ తెలిపారు. 80 మంది సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించామని చెప్పారు. వరదలో చిక్కుకున్న ఇండ్లలో ఎవరూ ఉండొద్దని, అందరూ షెల్టర్లకు వెళ్లాలని, లేదంటే సురక్షిత ప్రాంతాల్లోని కుటుంబ సభ్యుల ఇండ్లకు వెళ్లాలని సూచించారు.

25 వేలకు పైగా అక్రమ కట్టడాలు

హైదరాబాద్ సిటీలో 25 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నది వాస్తవమేనని, తమకు కూడాసర్వే చేస్తేనే ఈ విషయం తెలిసిందని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతానికి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తామని, అక్రమ కట్టడాల సంగతి తర్వాత చూస్తామని అన్నారు. వరదలపై ముందుగా అప్రమత్తం చేయాలని కొందరు అంటున్నారని, వర్షం పడుతుందన్న సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుందని, ఎంత వర్షం కురుస్తుందో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. భారీ వానలకు గుర్రం చెరువు, ప‌‌ల్లె చెరువు, అప్పా చెరువు కట్టలు తెగాయని చెప్పారు. ఇప్పటికీ 80 కాలనీల్లో వరద నీరు అలాగే ఉందన్నారు. నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం కష్టమవుతోందని తెలిపారు.