
ప్రజలెవరూ జనవరి నెల కరెంటు బిల్లులు కట్టొద్దని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరెంట్ బిల్లుల గురించి అడిగితే అధికారులకు సీఎం గతంలో చేసిన వ్యాఖ్యలను చూపించాలని సూచించారు. కరెంట్ బిల్లులను 10 జన్ పథ్ లోని సోనియాగాంధీ ఇంటికి పంపాలన్నారు. హైదరాబాద్ లోని ప్రతి ఒక్క మీటర్ కు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్ 50 రోజుల పాలనలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించారు కేటీఆర్. గతంలో ఆదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్..ఇవాళ ఆయన వెంటపడుతున్నారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయన్నారు. రేవంత్ కాంగ్రెస్ ఏక్ నాథ్ షిండేగా మారుతారని ఆరోపించారు. రేవంత్ తెలంగాణ చోటా మోదీ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రక్తమంతా బీజేపీదే.. అదానీ,రేవంత్ ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలన్నారు.