
యాదాద్రి, వెలుగు: యువత, ఉద్యోగులు దూరం కావడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, అయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు తమపై అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు 70శాతం జీతాలు పెంచింది. అది వదిలేసి ఒకటో తేదీన శాలరీలు ఇస్తలేరని బీజేపీ, కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో ప్రచారం చేసిన్రు. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ.. దేశానికి ఏం చేశారు? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైంది? నల్లధనం ఎక్కడని ప్రశ్నిస్తే తెల్ల ముఖం వేస్తున్నరు’’అని విమర్శించారు.
ఆదివారం యాదాద్రి జిల్లా భువనగిరి, ఆలేరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘మహాలక్ష్మి స్కీమ్ పూర్తిగా అమలు చేయకుండానే.. చేశామంటూ రాహుల్, ప్రియాంక చెప్పుకుంటున్నరు. మా హయాంలో రెడీ చేసిన 30 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ఇచ్చినట్టు రేవంత్ చెప్పుకుంటున్నరు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా.. ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు. ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఒక్క రూపాయి సాయం చేయలేదు’’అని మండిపడ్డారు.
దేవుడి పేర్ల మీద ఓట్లడుగుతున్నరు
దేవుళ్ల పేరు చెప్పుకుని మోదీ రాజకీయాలు చేస్తుంటే.. తాము దేవుళ్ల పేరు మీద ప్రాజెక్టులు కట్టి ప్రజలకు మేలు చేశామని కేటీఆర్ అన్నారు. ‘‘మేకిన్ ఇండియా.. స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా.. డిజిటల్ ఇండియా లక్ష్యాలేవీ నెరవేరలేదు. అయోధ్యలో రాముడికి గుడి కట్టి మోదీ ఓట్లు అడుగుతున్నరు. మేమూ గుడులు కట్టినం.. కానీ, ఓట్లు అడగలేదు. పదేండ్ల ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మూడు మెడికల్ కాలేజీలు కట్టింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి రెండు కారణాలున్నాయి.
ఒకటి.. చేసిన పని చెప్పుకోలేదు. రెండోది.. కొన్ని వర్గాలను దూరం చేసుకున్నం’’అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అధికార స్వరం వినిపించే వాళ్లు కాదని.. ధిక్కార స్వరాలు వినిపించేవాళ్లు అని చెప్పారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు నాట్లు వేసుకునే టైమ్‌కు రైతుబంధు వచ్చేది. ఇప్పుడు రైతులు ఓట్లేసేటప్పుడు రైతుబంధు వస్తున్నది. ఓటేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు చూడాలి. ఒకవైపు బిట్స్ పిలానిలో చదువుకున్న అభ్యర్థి ఉన్నడు.. మరోవైపు బ్లాక్ మెయిలర్ ఉన్నడు’’అని అన్నారు. మీటింగ్ లో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.