2020.. టీఆర్ఎస్ నామ సంవత్సరం

2020.. టీఆర్ఎస్ నామ సంవత్సరం

ఈ దశాబ్దం మాదే.. కాంగ్రెస్సే మాకు ప్రధాన ప్రత్యర్థి
కేసీఆర్ ని మించిన హిందువు లేడు
దేశంలోని హిందువులంతా సీఏఏకు మద్దతిస్తు న్నారా?
ఎమ్మెల్యేలు రెబల్స్​ కడుపులో తలపెట్టయినా బుజ్జగించాలి
సరిగ్గా పనిచేయకపోతే ముందు మా కౌన్సిలర్లపైనే వేటు
నేను సీఎం అన్న చర్చకు తావులేదు.. కేసీఆరే సీఎం
మీడియాతో చిట్ చాట్ లో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
‘పోతిరెడ్డిపాడు’ లాంటివి భూతద్దంలో చూడొద్దు : కేటీఆర్

రైతు బంధు విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. రైతుబంధు అందక ఎవరూ ఇబ్బంది పడటంలేదు. అవస్థపడితే రోడ్డెక్కే వాళ్లు కదా.. అసలు రైతు బంధు ఇవ్వక ముందు రాష్ట్రంలో పరిస్థితి ఏంది?.
– కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: ఇది టీఆర్​ఎస్​ నామ సంవత్సరమని, 2020–-30  దశాబ్దం టీఆర్ఎస్ దేనని ఆ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.  దేశమంతా  తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. 2019 ఏడాది టీఆర్ఎస్​కి మంచి ఆరంభం ఇచ్చిందని, అదేవిధంగా 2020 కూడా మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయంతో ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. రానున్న రోజుల్లో పార్టీ పరంగా తీసుకునే కార్యక్రమాలు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ముచ్చటించారు.

నేను కాదు.. కేసీఆరే సీఎం

మున్సిపల్ ఎన్నికల తర్వాత కేటీఆర్​ను సీఎం చేస్తారంటూ పార్టీలో, బయట జరుగుతున్న ప్రచారంపై  ఆయన స్పందించారు. ‘ఇంకో పదేండ్లు సీఎం గా తానే ఉంటానని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇంకా దానిపై ఊహాగానాలు దేనికీ?  దానిపై ఇంకా చర్చకు తావు లేదు’ అని కేటీఆర్​ స్పష్టం చేశారు.  ఆర్టీసీ సమ్మె సమయంలో తిట్టిన కార్మికులు ఇప్పుడు  కేసీఆర్​కు జేజేలు కొడుతున్నారని కేటీఆర్ అన్నారు. ‘అవకాశాన్ని అనుకూలంగా మల్చుకోవడంలో కేసీఆర్ దిట్ట. అందులో ఆయన్ను మించిన వారు ఎవరూ లేరు’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలకు ఎత్తు పల్లాలు సహజం అని చెప్పారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో అన్ని ఎంపీ స్థానాలు గెలుస్తామనుకున్నామని, కానీ సాధ్యం కాలేదని అన్నారు.

కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి

రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి ఎవరూ శత్రువులు లేరని, అంశాల వారీగా మాత్రమే ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయని కేటీఆర్​ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీని ఆషామాషీగా తీసుకోం. ఆ పార్టే మాకు ప్రధాన ప్రత్యర్థి. కాంగ్రెస్​కు 150ఏండ్ల చరిత్ర ఉంది.  అధికారంలో ఉన్నామని చులకనగా మాట్లాడం’ అని చెప్పారు. ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పదవిని వదలుకుంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతం అని కేటీఆర్ అన్నారు.

బీజేపీ.. పెద్దగా పెరగలేదు

తన చిన్నప్పుడు బీజేపీ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని, పెద్దగా ఏం పెరగలేదని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆ పార్టీ గాలిలో నాలుగు సీట్లు గెలవగానే గొప్ప పార్టీ కాదని విమర్శించారు. డిఫెన్స్ భూములు ఇవ్వాలంటూ కేంద్రానికి చాలా సార్లు విజ్ఞప్తి చేశామని, కానీ కేంద్రం మాత్రం ఏం స్పందించడం లేదని ఆయన అన్నారు. ‘భూములు ఇవ్వాలని అడుగుతాం.. ఇవ్వకపోతే యుద్ధం చేయలేం కదా’ అని వ్యాఖ్యానించారు.

కేంద్రం వివక్ష చూపుతోంది

బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక రకంగా ఇతర పార్టీలు ఉన్న రాష్ట్రాలను మరోరకంగా కేంద్రం చూస్తోందని కేటీఆర్​ ఆరోపించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. ‘ కేంద్రం ప్రగతి శీల రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మంచిది. ప్రతి విషయంలో రాజకీయాలు ఆలోచించడం మంచిది కాదు. కేంద్రం సాయం చేయకున్నా ఐటీలో తెలంగాణ ఫస్ట్​లో ఉంది’ అని కేటీఆర్ తెలిపారు.

సంక్రాంతి తర్వాత పార్టీ ఆఫీసుల ప్రారంభం

మున్సిపల్ ఎన్నికల తర్వాత పూర్తిగా పార్టీ బలోపేతం కోసం దృష్టి సారిస్తానని కేటీఆర్  చెప్పారు. గ్రామ, మండల కమిటీలు పూర్తయ్యాయన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం ముగింపు దశలో ఉందని తెలిపారు. సీఎం చేతుల మీదుగా సంక్రాంతి తర్వాత పార్టీ ఆఫీసులను ప్రారంభించుకుంటామన్నారు. ‘రాబోయే 11 నెలలు జిల్లాలవారీగా కార్యకర్తలకు ట్రైనింగ్ ఇస్తాం. రాష్ట్రస్థాయిలో కూడా శిక్షణ తరగతులు ఉంటాయి. డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటాం’ అని కేటీఆర్​ వివరించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రభుత్వం, ప్రజల మధ్య సంధానకర్తలుగా కార్యకర్తలు ఉండేలా తయారు చేస్తామన్నారు.

మున్సిపోల్స్​పై వారంలో సీఎం భేటీ

మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను టీఆర్​ఎస్​ గెలుచుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే మేమే ముందున్నాం. గ్రౌండ్​ లెవల్​ రిపోర్టు రెండు రోజుల్లో అందుతుంది. ఈ వారంలో సీఎం నేతృత్వంలో సంయుక్త సమావేశం ఉంటుంది’ అని చెప్పారు. సీఎం నిర్వహించే సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతారని ఆయన తెలిపారు. మున్సిపోల్స్ లో టీఆర్ఎస్​ టికెట్​ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్కో దగ్గర పది మంది వరకు ఉన్నారని తెలిపారు. ‘రెబల్స్ ను పోటీ నుంచి తప్పించడానికి వాళ్లను బుజ్జగించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే. అవసరమైతే వాళ్ల కడుపులో తలపెట్టి బతిమిలాడాలి. రెబల్స్​కు ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పి బుజ్జగిస్తాం.  సిరిసిల్లలో చాలా పోటీ ఉంది. వాళ్లను బుజ్జగించే పనిలో ఉన్నా’  అని పేర్కొన్నారు.

మా కౌన్సిలర్లపైనే మొదటి వేటు

2020 కొత్త ఏడాదిలో మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే చాలెంజ్​గా పెట్టుకున్నట్లు కేటీఆర్  చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముందుగా చట్టం గురించి తెలుసుకున్నాకే పోటీకి దిగాలని ఆయన సూచించారు. ‘విధులు సరిగా నిర్వర్తించపోతే వేటు వేస్తాం. అప్పుడు బాధ పడి ప్రయోజనం ఉండదు. పనులు చేయని టీఆర్ఎస్  కౌన్సిలర్లు, చైర్మన్లపైనే మొదటి వేటు ఉంటుంది’ అని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారందరికీ పార్టీలకతీతంగా శిక్షణ తరగతులు ఉంటాయని చెప్పారు. ఓ వైపు పల్లె ప్రగతి.. మరోవైపు పట్టణ ప్రగతి సమాంతరంగా కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

ఈ ఏడాదే ఫార్మా  సిటీ ప్రారంభం

హైదరాబాద్ శివారులో నిర్మిస్తున్న ఫార్మా  సిటీని ఈ ఏడాదిలోనే ప్రారంభించుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే అక్కడ మౌళిక వసతులు కొనసాగుతున్నాయని, పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలో ఫార్మా, టెక్స్ టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. ఈ నెల 3న ముంబైలో జరుగనున్న ఫార్మా సదస్సుకు తాను హాజరుకాబోతున్నట్లు కేటీఆర్​ చెప్పారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం ‘ఈచ్​ వన్​ టీచ్​ వన్​’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు

‘పోతిరెడ్డిపాడు’ను భూతద్దంలో చూడొద్దు

ఏపీ సీఎం జగన్​తో దూరం పెరగలేదని, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉందని కేటీఆర్ అన్నారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతామంటూ జగన్ ఏపీ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా.. ‘చిన్న, చిన్న ఇష్యూలు వస్తుంటాయి. అండర్ స్టాండ్ తో పరిష్కరించుకోవాలి. ప్రతి దాన్నీ భూతద్దంలో పెట్టి చూడొద్దు’ అని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుతో సత్సంబంధాలు కొనసాగాయని, తాము యాగం చేసినప్పుడు ఆయన్ను పిలిచామని, ఏపీ రాజధాని శంకుస్థాపనకు ఆయన తమను పిలిచారని చెప్పారు. ఏపీతో కలిపి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ లోకి తరలించాలనే విషయం ఆలోచనలో మాత్రమే ఉందని, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్‌ను మించిన హిందువు లేడు
సీఏఏను హిందువులు కూడా వ్యతిరేకిస్తున్నారని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు లేడని, దేశంలోని హిందువులంతా సీఏఏకు మద్దతిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ‘ఎంఐఎం నిజామాబాద్‌లో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక సభకు మా పార్టీ ఎమ్మెల్యేలు హాజరవడం నెగిటివ్ కాలే. సీఏఏను కేవలం ముస్లింలే వ్యతిరేకించడం లేదు. హిందువులు కూడా వ్యతిరేకిస్తున్నరు. నేను హిందువును, నేను కూడా వ్యతిరేకిస్తున్న’ అని కేటీఆర్ చెప్పారు. ఎన్పీఆర్, ఎన్నార్సీ విషయంలో పార్టీ నిర్ణయం కంటే ప్రభుత్వం నిర్ణయమే ముఖ్యమన్నారు. వాటిపై అందరితో మాట్లాడినతర్వాతే సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దేశం మంచి కోసం కేంద్రం మళ్లీ ఏదైనా బిల్లు తెస్తే తప్పకుండా సపోర్టు చేస్తామని ఆయన అన్నారు. మజ్లిస్ మిత్రపక్షమే.. దానితో కలిసి పోటీ చేయం మజ్లిస్ పార్టీ తమకు మిత్రపక్షం మాత్రమేనని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని పాతబస్తీకి కూడా మెట్రో రైలు సర్వీసు తప్పకుండా వస్తుందన్నారు.