సన్నబియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కాం : కేటీఆర్

సన్నబియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కాం  : కేటీఆర్

కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చెబుతున్నామని మాజీ మంత్రి,  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తు చేశారు. సన్న బియ్యం కొనుగోళ్ల కోసం జనవరి 25న కమిటీ వేసి, టెండర్లు పిలిచి ఒక్కరోజులో ప్రక్రియ పూర్తి చేయడమేంటని ప్రశ్నించారు. కేవలం 4 సంస్థలకే టెండర్లు కట్టబెట్టడం దారుణమన్నారు. గత ప్రభుత్వం బ్లాక్ చేసిన కేంద్రీయ భండార్ సంస్థ టెండర్ ను ఆమోదించడం సరికాదన్నారు. ఈ ప్రక్రియలో ₹1,100 కోట్ల స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌ 15 రోజుల కిందట మొట్టమొదటిసారి నిర్దిష్ట ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గానీ.. సీఎం రేవంత్‌ రెడ్డి గానీ ఈరోజు వరకు పెద్దవి విప్పడం లేదు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నిర్దిష్టమైన ఆధారాలతో బయటపెడుతున్నం. నిజానికి కాంగ్రెస్‌ అంటేనే స్కాం..గ్రెస్‌ అని అన్నారు.  ఢిల్లీలో ఉండే కాంగ్రెస్‌ పెద్దలకు ఇచ్చుకో అన్నట్లుగా ఉంది. ఇవాళ రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద స్కామ్​లకు కాంగ్రెస్‌ పార్టీ తెరలేపింది. 

ముఖ్యమంత్రి పేషీ నుంచి పౌరసరఫరాల డిపార్ట్‌మెంట్‌ నుంచే ఈ కుంభకోణం జరిగిందని మాకు సమాచారం ఉంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం.. కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. వాళ్లు వీళ్లు కలిసి సీక్రెట్‌గా దందా చేసి వెయ్యి కోట్లు కుంభకోణం చేశారు. రాష్ట్రంలో బీ ట్యాక్స్‌ అని.. ఆర్‌ ట్యాక్స్‌ అని.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అని.. యూ ట్యాక్స్‌ అని ట్యాక్స్‌ల గురించి వింటున్నం. ఈ స్కాంలో మాత్రం కేవలం తెలంగాణలోని కాంగ్రెస్‌ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా హస్తం ఉందని మాకు సమాచారం ఉంది. ప్రజల జేబులు నింపే పని చేతనైతలేదు గానీ.. కాంగ్రెస్‌ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో బిజీ బిజీగా ఉన్నరు’ అని కేటీఆర్ విమర్శించారు.