హంగ్ మున్సి పాలిటీల్లో కాంగ్రెస్ అరాచకాలు : కేటీఆర్

హంగ్ మున్సి పాలిటీల్లో కాంగ్రెస్ అరాచకాలు : కేటీఆర్
  •     మా కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కిడ్నాప్​ చేస్తున్నరు: కేటీఆర్
  •     34 చోట్ల హంగ్​.. మాకు ఓ పది వరకు దక్కే అవకాశం
  •     సింగరేణిలో దోపిడీని అరికట్టేందుకే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతిచ్చినం
  •     తెలంగాణ భవన్​లో  సేవాలాల్​ మహారాజ్‌ జయంతి వేడుకలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 34 మున్సిపాలిటీల్లో హంగ్​ పరిస్థితులున్నాయని, ఆయా చోట్ల కాంగ్రెస్​ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని, వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల కిడ్నాప్​లకూ పాల్పడుతున్నారని, పోలీసులను, గూండాలను పంపిస్తున్నారని మండిపడ్డారు. 

హంగ్​ ఏర్పడిన మున్సిపాలిటీల్లో 10 వరకు బీఆర్ఎస్​కు వచ్చే అవకాశముందన్నారు. ఆదివారం తెలంగాణభవన్​లో సేవాలాల్​ మహారాజ్​ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​తో సీపీఐ కూటమిగా ఏర్పడిందని, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకే తాము సీపీఐకి మద్దతు ప్రకటించామని చెప్పారు. కాంగ్రెస్​తో పొత్తుకు ఏఐటీయూసీ ఎలా ఒప్పుకుందో తెలియదన్నారు. 

కొత్తగూడెం మేయర్​ పదవిని రెండు పార్టీలు పంచుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్​ కలిసి సింగరేణిలో దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతామని ఆయన తెలిపారు.  

జల్ జంగల్ జమీన్​ స్ఫూర్తితో కేసీఆర్​ పాలన

‘మా తండాల్లో మా రాజ్యం’ అన్న నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్​ అన్నారు. గిరిజన గూడేలు, కోయ గూడేలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారని, వేలాది గిరిజన యువతకు సర్పంచ్​లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులకు భూమి హక్కులను రక్షించిందీ బీఆర్​ఎస్​ ప్రభుత్వమేనని చెప్పారు. 

కొమురం భీమ్​ నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్​ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో గిరిజనులకు కేసీఆర్​ న్యాయం చేశారని, వారి జీవనప్రమాణాలను మెరుగుపరిచారని చెప్పారు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఇంటర్​, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనని చెప్పారు. రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించామన్నారు. 

సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్​షిప్​ ప్రోగ్రామ్​ ద్వారా గిరిజన యువతకు ప్రభుత్వ సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామన్నారు. బంజారాహిల్స్‌‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం ద్వారా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని, రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేశామని ఆయన చెప్పారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా గిరిజన గౌరవానికి నిదర్శనమని అన్నారు.