తెలంగాణను బంగారు పళ్లెంలో అప్పగించాం: కేటీఆర్

తెలంగాణను బంగారు పళ్లెంలో అప్పగించాం: కేటీఆర్
  •  రైతులు ఎరువుల కోసం క్యూ కడ్తుండ్రు
  • ఆరు నెలల్లోనే సర్కారుపై జనం తిరగబడ్తరు
  •  మనది బలమైన పార్టీ తిరిగి పట్టాలెక్కుతుంది
  •  కార్యకర్తల అభిప్రాయాలు కేసీఆర్ కు తెలుపుతాం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాలతో నాటకాలు మొదలుపెట్టిందని ఆయన విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము అప్పులుకాదు ఆస్తులు సృష్టించామని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, రాజధానిలో ప్రతి చోటా అనేక వేల కోట్ల ఆస్తులు సృష్టించామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిది అవకాశవాదమని అన్నారు. 

దావోస్ సాక్షిగా అదానీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని రుజువు చేశారని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అన్న కాంగ్రెస్ పార్టీ.. మరి ఇప్పుడు అదే అదానితో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, తిరిగి పట్టాలెక్కుతుందని చెప్పారు.  పార్టీ అన్ని స్థాయిలో కమిటీలను కొత్తగా వేసుకుంటామని, నిరంతరం అన్ని అంశాల పైన పార్టీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు.  గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓటమికి కుంగిపోమని అన్నారు. ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాల కోసమే పని పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు.