
మణిపుర్లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యచారానికి పాల్పడిన ఘటన తాలూకు దురాగతంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ట్విటర్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్లో 'మోదీజీ.. అమిత్‌షా జీ.. మీరు ఎక్కడున్నారు. మణిపుర్లో తాలిబన్తరహా ఘటన జరుగతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది. తాలిబన్లు పిల్లలను, మహిళలను అగౌరవపరిస్తేనే.. ఇండియన్స్ గా మనం వారిపై విరుచుకుపడుతున్నాం. అలాంటిది.. మణిపుర్లో కుకీ తెగ మహిళల్ని మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురి చేయడం బాధాకరం.
అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు దెబ్బ తిన్నా కేంద్రం మౌనంగా ఉంటోంది. మోదీగారు.. దయచేసి అన్నీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని ఆ రాష్ట్రాన్ని రక్షించడం కోసం ఉపయోగించండి.' అంటే కేటీఆర్ ట్వీట్ చేశారు. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపుర్ అంశాన్ని భారత్ రాష్ట్ర సమితి పార్టీ లేవనెత్తుతుందని మంత్రి అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర ప్రజలకు అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
జరిగిందిదే..
మణిపుర్లో రెండు తెగల మధ్య రిజర్వేషన్ సంబంధించి తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. రాజధాని ఇంఫాల్‌కు 35 కి.మీ.ల దూరంలోని కాంగ్పోప్కి జిల్లాలో మే 4న చాలా మంది పురుషులు ఇద్దరు మహిళల్ని నగ్నంగా తీసుకెళ్తున్నారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. వారంతా కలిసి మహిళల్ని సమీపంలోని పొలంలో బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది. నిందితులపై నాంగ్పాక్ సెక్మై పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు.
బీఆర్ఎస్ వాయిదా తీర్మానం..
మణిపుర్ అల్లర్లపై చర్చించాలని పట్టుబడుతూ.. విపక్షాలు ఆందోళన చేస్తున్న వేళ.. లోక్‌సభలో చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇదే సమయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది.