కేటీఆర్​.. లీగల్ నోటీసులు వాపస్​ తీస్కో : రేవంత్‌ రెడ్డి

కేటీఆర్​.. లీగల్ నోటీసులు వాపస్​ తీస్కో :  రేవంత్‌ రెడ్డి
  • కేటీఆర్​.. లీగల్ నోటీసులు వాపస్​ తీస్కో
  • మంత్రి కేటీఆర్‌‌కు రేవంత్‌ రెడ్డి హెచ్చరిక
  • రాజకీయంగా వేధించేందుకే నోటీసులతో బెదిరిస్తున్నారని ఫైర్‌‌
  • ప్రజల తరఫున పోరాడుతుంటే గొంతు నొక్కుతున్నరని ఆవేదన
  • తనపై మోపిన  పరువు నష్టం ఆరోపణలన్నీ బూటకమేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్‌‌ తనకు ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్‌‌ను తాను ఎక్కడా అవమానించినట్టు మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరఫున పోరాడుతుంటే తన గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజకీయంగా వేధించేందుకే లీగల్ నోటీసుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని రేవంత్​ మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పరువు నష్టం కింద రేవంత్‌కు గత నెల 28న మంత్రి కేటీఆర్ రూ.100 కోట్లకు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్‌ తన అడ్వకేట్ ద్వారా శనివారం రిప్లై ఇచ్చారు. తనపై బనాయించిన పరువు నష్టం ఆరోపణలన్నీ బూటకమని రేవంత్​ పేర్కొన్నారు. తనకు నోటీసులిచ్చినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.  

పేపర్ లీకేజీలతో  నిరుద్యోగులు పడుతున్న గోస, బాధలు  కేటీఆర్‌‌కు పట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ దేశంలోనే లేరని, అలాంటప్పుడు నిరుద్యోగుల సమస్యలపై ఆయనకు ఎమోషనల్ టచ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉందో.. ప్రతిపక్షాలకూ అంతే ఉందని రేవంత్‌ అన్నారు. ప్రస్తుతం ఇచ్చిన లీగల్ నోటీసులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని, రాష్ట్రం కోసం ఉద్యోగులు, నిరుద్యోగులు తమ రక్తం చిందించారని  గుర్తుచేశారు.

అప్లై చేసుకున్నోళ్ల వివరాలు ఎట్ల చెప్తరు..

పేపర్ లీక్ కేసులో కిందిస్థాయి ఉద్యోగుల వరకే విచారణను పరిమితం చేసే కుట్ర జరుగుతున్నదని రేవంత్ ఆరోపించారు. గత నెల 18న మంత్రులు, కమిషన్ చైర్మన్‌తో సీఎం కేసీఆర్‌‌ సమావేశమయ్యారని, ఆ రోజే కేటీఆర్ ప్రెస్‌మీట్‌ పెట్టి ఇద్దరు వ్యక్తులే పేపర్ లీక్ చేశారంటూ చెప్పారన్నారు. ఆ తర్వాత గత నెల 27న పెట్టిన ప్రెస్‌మీట్‌లో గ్రూప్1కు అప్లై చేసుకున్నోళ్ల సమాచారాన్ని కేటీఆర్‌‌ బయటకు చెప్పారని, వారి వివరాలను ఎట్ల బయటకు చెప్తారని, ఆ విషయాలు ఆయనకు ఎలా తెలుసని రేవంత్‌ ప్రశ్నించారు. సిట్ విచారణలోని విషయాలన్ని కేటీఆర్‌‌కు ముందే ఎలా తెలుస్తున్నాయని నిలదీశారు. పేపర్ లీక్ కేసు విచారణను కేటీఆర్ ప్రభావితం చేస్తున్నారన్నానని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని కప్పిపుచ్చేందుకే లీకేజీ కేసును ఇద్దరు ఉద్యోగులకు పరిమితం చేసే ప్రయత్నం  చేశారని మండిపడ్డారు. పొరపాటుగా జరగలేదు..

పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ‘పొరపాటు’గా జరిగిందనో, కొందరు వ్యక్తులు ‘దురుద్దేశం’తో చేశారనో చెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. టీఎస్ పీఎస్సీలో అర్హత లేని ఏడుగురిని సభ్యులుగా రాష్ట్ర సర్కారు నియమించిందని, వారికి కనీసం రాష్ట్ర సివిల్ సర్వీసులో అనుభవం కూడా లేదన్నారు. దీనిపై గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైందని గుర్తుచేశారు. ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగినప్పుడు బోర్డు సెక్రటరీగా జనార్దన్ రెడ్డి ఉండేవారని, ఆయనను తీసుకొచ్చి టీఎస్ పీఎస్సీ చైర్మన్‌గా నియమించారన్నారు. ప్రస్తుత పేపర్ లీకేజీకి 2015లోనే లింకులున్నాయని రేవంత్ ఆరోపించారు. ఆ ఏడాది టీఎస్ పీఎస్సీకి వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అప్‌గ్రెడేషన్ కోసం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్)కు బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. పేపర్ లీక్ కేసులో రెండో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి.. టీఎస్‌టీఎస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కాదా అని ప్రశ్నించారు.