హైదరాబాద్, వెలుగు: కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, కొరత లేకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం వల్ల హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, పీజీ హాస్టళ్లు, చిన్నచిన్న ఆహార వ్యాపార సంస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు.
ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి గురువారం ఆయన లేఖ రాశారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే వేలకొద్ది వ్యాపార సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని, ఫలితంగా లక్షల మంది కార్మికులు, స్టూడెంట్లు ఇబ్బందులు పడతారన్నారు. చిన్న వ్యాపారులను రక్షించేందుకు దశలవారీగా ఎల్పీజీ కేటాయింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచకుండా తాత్కాలికంగా ధరల స్థిరీకరణ చేయాలి. ఇంట్లో వాడే సిలిండర్లను అక్రమంగా కమర్షియల్ అవసరాలకు మళ్లిస్తూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. దానిని నివారించేలా చర్యలు తీసుకోవాలి. పీజీ హాస్టళ్లకు ప్రత్యేక రక్షణ కేటగిరీ కింద గ్యాస్ సరఫరా చేయాలి” అని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా ఐటీ కంపెనీలు, ఐటీ పార్కుల్లోనూ కమర్షియల్ సిలిండర్ల వాడకం ఎక్కువగా ఉంటున్నదని, ఐటీ సెక్టార్‌లోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌హోం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి
రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా లైసెన్స్ డ్ సర్వేయర్లను నియమించినా నెలల తరబడి పని, జీతభత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ధరణి స్థానంలో భూభారతిని తెచ్చి లైసెన్స్ డ్ సర్వేయర్లను తీసుకొచ్చినా వారికి అన్యాయం చేస్తున్నదన్నారు. గురువారం పలువురు లైసెన్స్ డ్ సర్వేయర్లు కేటీఆర్‌ను కలిసి తమ సమస్యల పరిష్కారానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
