వీర్నపల్లి/ఎల్లారెడ్డిపేట, వెలుగు: కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మతం పేరుతో ప్రజల నెత్తి కరాబ్ చేసి, ఓట్లు వేయించుకునుడు తప్ప.. ఆయనకేమన్న చదువు వస్తదా.. శాస్త్రం తెలుస్తదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పర్యటించి పలు ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్టాపన, అమ్మవార్ల కల్యాణ మహోత్సవంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీర్నపల్లి మండల కేంద్రంలో సర్పంచులు, ఉప సర్పంచులతో సమావేశమై వీర్నపల్లి అభివృద్ధిపై చర్చించారు.
చాకుల్లాంటి యువతను తీసుకొని యుద్ధానికి ఎలాగైతే సిద్ధమవుతామో.. రానున్న ఎన్నికలకు కార్యకర్తలు అలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘‘బీజేపీ వాళ్లకు రైతుల గురించి తెల్వదు, కరెంటు గురించి అసలే తెల్వదు.. మతం పేరు మీద ప్రజలను నెత్తి కరాబ్ చేసుడే బండి సంజయ్ పని.. కేంద్ర మంత్రిగా రెండున్నరేండ్లలో ఒక్క రూపాయి పని అయినా చేశావా’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు వదిలించుకుంటున్నారని, కానీ తెలంగాణలో మాత్రం ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకొని ఆగమవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నారని ఈ రెండున్నరేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. ఒక ఓటు తప్పుకు ఐదేండ్ల శిక్ష తప్పదని, ఓపిక పట్టాలని ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలినయ్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఘోరమైన నేరాలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక తేటతెల్లం చేసిందని శుక్రవారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజల ఆస్తిపాస్తులను, ప్రాణాలను రక్షించడంలోనూ, శాంతిభద్రతలను కాపాడటంలోనూ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసమే మళ్లించడం వల్లే.. ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయిందన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య అత్యంత దారుణంగా హత్యకు గురికావడం దిగ్భ్రాంతికరమన్నారు. సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఒక యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు భారీగా పెరిగినట్టు తాజా ఎన్సీఆర్బీ నివేదికలు చెబుతున్నాయని, ఇది ప్రస్తుత ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు
