రెండు పెన్షన్లు తీసుకుంటున్నందుకే ఆసరా ఆపేసినం: కొత్త గూడెం కలెక్టర్

రెండు పెన్షన్లు తీసుకుంటున్నందుకే ఆసరా ఆపేసినం: కొత్త గూడెం కలెక్టర్
  • దాసరి మల్లమ్మకు నోటీసుపై కొత్తగూడెం కలెక్టర్ వివరణ
  • నోటీసులివ్వడంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్​లో కేటీఆర్ పోస్ట్

హైదరాబాద్/కొత్తగూడెం, వెలుగు: కొత్త గూ డెం పట్టణానికి చెందిన దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు రెండు పెన్షన్లు అందుకుంటున్నారని అందుకే వృద్ధాప్య పింఛను ఆపేసినట్టు కొత్తగూడెం కలెక్టర్ జితేశ్.వి పాటిల్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమెకు రికవరీ నోటీసులు ఇచ్చామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి(అన్​ మ్యారీడ్​)ఏఎన్​ఎంగా పనిచేస్తూ మృతి చెండంతో డిపెండెంట్​గా ఉన్న ఆమెకు రూ.20వేలు ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నదని వివరించారు. ఈ క్రమంలోనే వృద్ధాప్య పెన్షన్​ను నిలిపివేస్తున్నామని వెల్లడించారు. ఇన్నేళ్లు అక్రమంగా రెండు పెన్షన్లు అందుకున్నందున వృద్ధాప్య పింఛనకు సంబంధించిన రూ.1లక్షా 72 వేలు కట్టాలని దాసరి మల్లమ్మకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. అయితే కూతురు చనిపోతే పెన్షన్ వస్తుందని, వృద్ధాప్య పింఛను ప్రభుత్వం ఇస్తుందనుకున్నానని.. 2 పెన్షన్లు తీసుకోకూడదని తెలియదని దాసరి మల్లమ్మ అన్నారు. 

‘ఎక్స్’​​లో కేటీఆర్ ఆరోపణలు

సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుంచి డబ్బును వెనక్కు పంపమని ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం ఈ మేరకు ట్వీట్ చేశారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏండ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన డబ్బు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు” అని విమర్శించారు.