నేను మీ ఆఫీసుకొస్తే.. మీడియాలో వార్తలొస్తయ్! : కేటీఆర్

నేను మీ ఆఫీసుకొస్తే.. మీడియాలో వార్తలొస్తయ్! : కేటీఆర్
  •     అసెంబ్లీ లాబీల్లో బీజేఎల్పీ నేతలతో కేటీఆర్​ సరదా సంభాషణ
  •     బీజేఎల్పీలోకి వెళ్లిన రాజాసింగ్​ను బయటకు రావాలన్న కేటీఆర్​
  •     మీరే లోపలికి రావాలంటూ కేటీఆర్​నూ ఆహ్వానించిన పాయల్​ శంకర్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం గవర్నర్​ స్పీచ్​ అయిపోగానే ఎవరి పార్టీల వాళ్లు.. వాళ్ల ఎల్పీల్లోకి వెళ్లారు. ఇదే క్రమంలో బీజేపీ నుంచి సస్పెండ్​ అయిన రాజాసింగ్​ బీజేఎల్పీలోకి వెళ్లారు. అదే సమయంలో బీజేఎల్పీ ఆఫీసుకు పక్కనే ఉండే బీఆర్​ఎస్​ఎల్పీ నుంచి కేటీఆర్ బయటకు వస్తూ.. ఆయన లోపలకు వెళ్తుండడాన్ని గమనించారు. వెంటనే సస్పెండ్​ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్తారు? బయటకు రావాలంటూ రాజాసింగ్​తో సరదాగా వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్​శంకర్.. కేటీఆర్​ను బీజేఎల్పీలోకి రావాలంటూ ఆహ్వానించారు. 

దానికి స్పందించిన కేటీఆర్.. ‘నేను లోపలికి వస్తే మీడియాలో లేనిపోని వార్తలు వస్తయ్’ అంటూ కామెంట్​ చేశారు. దీంతో రెండు పార్టీల సభ్యులు నవ్వులు చిందించారు. ఆ తర్వాత కేటీఆర్​ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మంత్రులు, పీసీసీ చీఫ్​ను అసెంబ్లీ లాబీల్లో కలిశారు. తన వివాహ గోల్డెన్​ జూబ్లీ సెలబ్రేషన్స్​కు రావాలంటూ వారిని ఆహ్వానించారు. అయితే, ఈ సందర్భంగా మీడియా.. కాంగ్రెస్​లోకి వెళ్తున్నారా? అని ప్రశ్నించగా మునిగిపోయే పడవలో ఎవరైనా చేరుతారా? అంటూ కామెంట్​ చేశారు. 

గ్రౌండ్​లో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసన్నారు. మరోవైపు అసెంబ్లీ లోపల కూడా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అధికార పక్షంవైపు కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి.. వారిని బీఆర్​ఎస్​ సభ్యుల దగ్గర కూర్చోవాలన్నారు. కాలె యాదయ్య దగ్గరకు వెళ్లి.. బీఆర్​ఎస్​ వైపు కూర్చోవాలని సూచించారు. అయితే, ఆయన మాత్రం తాను కాంగ్రెస్​ వైపే కూర్చుంటానని చెప్పడం గమనార్హం.